టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మరో రెండేళ్ల పాటు అదే పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతానికి ఈవో లేరు. ఆయనే అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. క్యాడర్ ప్రకారం ఈవో పదవి ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి.. అసలు ఈవోను నియమించకుండా.. అదనపు ఈవోగా ధర్మారెడ్డిని ఉంచి ఆయన ద్వారా పరిపాలన చేస్తున్నారు. ఆ పరిపాలన మరో రెండేళ్లు సాగనుంది. ఈ మధ్యలో ప్రభుత్వం ఎవరినైనా ఈవోగా నియమించిన ఆయన డమ్మీగానే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ధర్మారెడ్డి అంత పవర్ ఫుల్ మరి. తాజాగా ఆయన పదవీ కాలం పొడిగింపు కోసం సీఎం జగన్ చేసిన ప్రయత్నాలు చేస్తే అదే అనుకోక తప్పదు.
ధర్మారెడ్డి అసలు సివిల్ సర్వీస్ కాదు. ఆయన రక్షణ శాఖ ఉద్యోగి. ఆయనను రాష్ట్ర సర్వీసుల్లోకి డిప్యూటేషన్ మీద పంపడమే విచిత్రం. కానీ వైఎస్ హయాంలో ఓ సారి తీసుకు వచ్చి టీటీడీలో పెట్టారు. అప్పట్లో వివాదాస్పద పరిస్థితుల్లో ఆయను తప్పించాల్సి వచ్చింది. జగన్ సీఎం కాగానే మళ్లీ ఆయనను రక్షణ శాఖ నుంచి టీటీడీలో పెట్టారు. ఆయన డిప్యూటేషన్ కాలం కొద్ది రోజుల కిందటే ముగిసింది. లెక్క అయితే డిప్యూటేషన్ ముగిసిన వెంటనే ఆయన ఢిల్లీలో రిపోర్ట్ చేయాలి. కానీ అలా చేయలేదు. టీటీడీలోనే కొనసాగుతున్నారు.
నిబంధనల ప్రకారం డిప్యూటేషన్ కు చాన్స్ లేదు. దీంతో ఆయన అక్కడ రాజీనామా చేస్తే రాష్ట్ర సర్వీసులోకి తీసుకోవాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ప్లాన్ ఏ ప్రకారం.. డిప్యూటేషన్ పొడిగింపు కోసం .. సీఎం స్థాయిలో ప్రయత్నించడం.. ప్లాన్ బీ ప్రకారం.. పదవికి రాజీనామా చేయించి రాష్ట్ర పోస్టు ఇవ్వడం. అయితే అక్కడ రాజీనామా చేస్తే ఇక్కడ పోస్టు ఇవ్వడం కోర్టుల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అందుకే జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో రాష్ట్రపతి ఎన్నికలతో ముడి పెట్టి చేసిన విజ్ఞప్తుల్లో ధర్మారెడ్డి ఇష్యూ కూడా ఒకటని తాజా పరిణామాలతో అర్థమవుతుంది.
మొత్తానికి ధర్మారెడ్డి చేతుల్లోనే టీటీడీ ఉండాలని వైసీపీ అధినేతపట్టుదలగా ప్రయత్నించారు. అనుకున్నది సాధించారు. మరో రెండేళ్ల పాటు ఆయన టీటీడీ ఈవోగా ఉంటారు. ఆ తర్వాత ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంటుంది. అలాగే వైసీపీ పదవీ కాలం కూడా అప్పటికే పూర్తయిపోతుంది.