ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంటే, రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని వైకాపా ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు నిన్న జిల్లాకి వచ్చినప్పుడు రెండేళ్ళ క్రితం ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా మళ్ళీ కొత్త హామీల గురించి మాట్లాడటాన్ని ఆయన తప్పు పట్టారు.
నాగావళి నదిపై పెండింగులో ఉన్న ప్రాజెక్టులు, అరసవిల్లి, శ్రీకూర్మం పుణ్యక్షేత్రాలను కలుపుతూ పర్యాటక ప్రాంతం అభివృద్ధి, పైడి భీమవరం వద్ద పారిశ్రామికవాడని అభివృద్ధి చేయడం వంటి ఒక డజను హామీలను ఈ సందర్భంగా గుర్తు చేసి, తెదేపా ప్రభుత్వానికి రెండేళ్ళ సమయం ఇచ్చిన తరువాతనే వాటి గురించి ప్రశ్నిస్తున్నామని, ఇంకా వాటన్నిటినీ ఎప్పుడు అమలు చేస్తారని ధర్మాన ప్రసాద రావు ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా విషయంలో కూడా ఆయన చంద్రబాబు నాయుడుని కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం అంత స్పష్టంగా చెపుతున్నప్పుడు, ఇంకా కేంద్ర ప్రభుత్వం పట్ల మెతక వైఖరి ఎందుకు అవలంభిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రం వైఖరి నిరసిస్తూ తక్షణమే తన ఇద్దరు కేంద్ర మంత్రులను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ నెల 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలలో తెదేపా కూడా వైకాపాతో కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేసారు లేదా తెదేపాయే పోరాటం మొదలుపెట్టినా దానికి తమ పార్టీ మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉందని చెప్పారు. బొత్స సత్యనారాయణ కూడా చంద్రబాబు నాయుడుకి ఇవే సూచనలు, ప్రతిపాదనలు చేసారు. రాష్ట్రంలో మళ్ళీ ప్రత్యేక వేడి రగిలినట్లే కనిపిస్తోంది. ఈ వేడికి కేంద్రం కరుగుతుందో లేక ఆ వేడే కొన్నాళకు మళ్ళీ చల్లారిపోతుందో చూడాలి.