మూడు రాజధానుల పేరుతో అభివృద్ధి చేస్తామని సీఎం జగన్ చెబుతున్నారు. కర్నూలుకు న్యాయరాజధాని అని చెబుతున్నారు. సీమలో సెంటిమెంట్ రేపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఉత్తరాంధ్రలో మాత్రం మంత్రి ధర్మాన ప్రసాదరావు ఒకే రాజధాని వాదన వినిపించడం ప్రారంభించారు. ఇది వైసీపీ వ్యూహమా లేకపోతే… ధర్మాన సొంత రాజకీయమా అన్నదానిపై స్పష్టత లేదు.కానీ ధర్మాన మాత్రం ఒకే రాజధాని.. అది విశాఖ మాత్రమే అనే వాదన తీసుకొస్తున్నారు. వరుసగా సదస్సులు నిర్వహిస్తున్న ఆయన ఇదే మాట చెబుతున్నారు.
కర్నూలులో హైకోర్టు ఉంటుంది కానీ అది న్యాయరాజధాని కాదని.. చెబుతున్నారు. కర్నూలు నుంచి న్యాయవ్యవహారాలు.. అమరావతి నుంచి శాసన వ్యవహారాలు చక్క బెడతామని.. అంతే కానీ అవి రాజధానులు కాదంటున్నారు. వీటికి ఉదాహరణకు ఒడిషా గురించి చెబుతున్నారు. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ అయితే కటక్‌లో హైకోర్టు ఉందని ధర్మాన గుర్తు చేశారు. అలాగే దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో హైకోర్టు ఓ చోట… రాజధాని మరో చోట ఉన్నాయని అంత మాత్రాన వాటిని రాజధానులని పిలవడం లేదని పరోక్షంగా గుర్తు చేశారు. ధర్మాన వ్యాఖ్యలతో రాయలసీమ వైసీపీ నేతల్లో అలజడి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టుకుంటే తప్ప గెలవలేమన్న స్థాయికి వైసీపీ పడిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమ నేతలు.. సీమ పేరుతో.. ఉత్తరాంధ్ర నేతలు ఉత్తరాంధ్ర.. విశాఖ పేరుతో ఉద్యమాలు చేస్తున్నారు. వారే అధికారంలో ఉన్నా.. ఏమైనా చేయాలంటే వారే చేయాలనే సంగతిని ఎక్కడా చెప్పుకోవడం లేదు. మూడున్నరేళ్లలో ఎక్కడా చిన్న అభివృద్ధి పని చేయకుండా రాజధాని వస్తే అభివృద్ధి జరిగిపోతుందని మభ్యపెడుతున్నారు.