విశాఖ భూదందాపై సిట్ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్లో మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రస్థావనకు వచ్చిందన్న కథనాలపై ఆయనే స్పందించారు. శ్రీకాకుళంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ… విశాఖ భూకుంభకోణంలో అసలు వ్యక్తుల పేర్లను బయటకి రాకుండా, వ్యవహారాన్ని పక్కతోవ పట్టించేందుకే తన పేరును ప్రస్థావించారన్నారు. ఈ వ్యవహారంలో ఒక ముఖ్యనేత ఉన్నారనీ, ఆయన్ని బయటకి రానీయకుండా కాపాడే ప్రయత్నమే ఇదనీ, ఆ ముఖ్యనేత ఎవరనేది తాను చెప్పనని కూడా ధర్మాన వ్యాఖ్యానించడం ఆసక్తికరం! తాను ప్రజల తరఫున గొంతు విప్పి మాట్లాడుతుంటాననీ, వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో సన్నిహితంగా ఉంటానని తనని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
గడచిన నాలుగు సంవత్సరాలుగా ప్రతిపక్షాల పీక నొక్కుతున్నారు అన్నారు. నిజాయితీగా ప్రతిపక్షాన్ని గౌరవించే సందర్భమే ఈ పాలనలో లేదన్నారు. రాజధాని నిర్మాణం తలపెడుతున్నప్పుడు, ప్రతిపక్షాలను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు ధర్మాన. వ్యూహం ప్రకారం దోపిడీ చేయడానికి మీకు నచ్చనట్టుగా చట్టాలు తయారు చేసుకున్నారని టీడీపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలకు తెలియకుండా, ప్రజలకు తెలియకుండా, కోర్టులను మోసం చేసి రాజధాని నిర్మాణం వ్యవహారంలో అడ్డగోలుగా వ్యవహరించారని ముఖ్యమంత్రిని ఉద్దేశించి విమర్శించారు. అనుభవం ఉన్న నాయకుడు అందించాల్సిన పాలన ఇది కాదన్నారు! ప్రతిపక్షం అనేది ప్రజల తరఫున మాట్లాడొద్దని టీడీపీ అనుకుంటోందన్నారు. సిట్ నివేదికలో తన పేరు ప్రస్థావించడం.. వ్యవహారాన్ని దారి మళ్లించే చర్య మాత్రమే అన్నారు.
సరే, విశాఖ భూదందా వరకూ ధర్మాన ఆవేదనను కాసేపు పక్కన పెడదాం! ప్రతిపక్షాల పీక నొక్కేస్తున్నారు, గౌరవించడం లేదు, మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు, ప్రజల తరఫున తాము మాట్లాడొద్దా… అంటూ కూడా చాసేపు మాట్లాడారు ధర్మాన. కరెక్టే… కానీ, ఆ బాధ్యత నుంచి తప్పుకున్నదే ప్రతిపక్ష పార్టీ వైకాపా కదా! ఈ విషయం ధర్మాన మరచిపోతే ఎలా..? విశాఖ భూదందా కావొచ్చు, రాజధాని నిర్మాణం కావొచ్చు, ఇంకోటి కావొచ్చు… వారికున్న అభ్యంతరాలను బాధ్యతగల ప్రతిపక్షంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎందుకు నిలదియ్యలేదు..? ప్రజల తరఫున పోరాడాల్సిన వేదికకు దూరంగా ఎందుకు ఉన్నారు..? ఈ అంశాలపై చట్టసభలో పోరాడొద్దని వైకాపాకి ఎవ్వరూ చెప్పలేదే! ఒక వ్యవహారంపై సిట్ నివేదిక ఇస్తే దాన్ని నమ్మరు, పోరాడేందుకు అసెంబ్లీ వేదిక ఉన్నా నమ్మరు, పోలీసుల్ని నమ్మరు… మళ్లీ, మా గొంతు నొక్కేస్తున్నామంటున్నారు! ఏంటో మరి… ఎక్కడ గొంతు వినిపించాలో అక్కడ ఆ ప్రయత్నం వారు చేయడం మానేసి… ఎవరో నొక్కేస్తున్నారంటూ ఇలా విమర్శలు చేస్తుంటే ఏమనుకోవాలి..?