ఇవ్వాళ్ళ మహానాడు రెండవ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, సమైక్య రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత, స్వర్గీయ ఎన్టీఆర్ పట్టుదల, కార్యదీక్ష, క్రమశిక్షణ, ఆత్మగౌరవం వంటి గొప్ప గుణాల గురించి వర్ణించి, నోరారా పొగిడారు. తెదేపా నేతలు, కార్యకర్తలు అందరూ కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే ఆయనకు ఇచ్చే గొప్ప నివాళి అని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఆయనని గౌరవిస్తూ అమరావతిలో 115.5 అడుగులు ఎత్తుండే ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. త్వరలో ఆయన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
చంద్రబాబు నాయుడు స్వర్గీయ ఎన్టీఆర్ ని పొగుడుతుంటే, ప్రజలు, ప్రతిపక్షాలే కాదు కొందరు తెదేపా నేతలు కూడా వినడానికి ఇబ్బందిపడుతుంటారు. కారణాలు అందరికీ తెలిసినవే. ఆవిషయల గురించి చాల మంది పైకి మాట్లాడటానికి ఇష్టపడకపోయినా, వైకాపా నేతలకు అటువంటి ఇబ్బందులు, అభ్యంతరాలు ఏవీ లేవు కనుక వారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడుని నేరుగానే ప్రశ్నించారు. వైకాపా సీనియర్ నేత ధర్మాన ప్రసాద రావు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడుతూ, స్వర్గీయ ఎన్టీఆర్ మహానుబావుడని అందరికీ తెలుసు. కానీ ఆయనను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి, అసెంబ్లీ సాక్షిగా ఆయనను దూషించిన చంద్రబాబు నాయుడే ఇప్పుడు ఆయన గొప్పదనాన్ని పొగడం చాలా విడ్డూరంగా ఉంది. ఈ రెండేళ్ళ పాలనలో చంద్రబాబు నాయుడు సాధించింది ఏమీ లేకపోయినప్పటికీ, ఏదో సాధించినట్లు గొప్పలు చెప్పుకొంటూ ప్రజలను భ్రమింపజేయాలని ప్రయత్నిస్తున్నారు.ఈ రెండేళ్ళ పాలనలో చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటంటే అవినీతిని వ్యవస్థీకరించారు అంతే.,” అని విమర్శించారు.
మరో నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పంచ భూతాలని కూడా వదిలి పెట్టకుండా దోచుకొంటోందని విమర్శించారు. చివరికి తెదేపా నేతలు మహాబలిపురంలోని అమరేశ్వర స్వామి ఆలయ భూములను కూడా వదిలిపెట్టలేదు. దానిపై సిబిఐ విచారణ వేయాలి. మహానాడులోనైనా ప్రజా సమస్యల గురించి చర్చించి పరిష్కారాలు కనుగొంటారంటే వాటిని గాలికి వదిలి ఆత్మస్తుతి, పరనిందలు చేసుకొంటూ కాలక్షేపం చేసేస్తున్నారు. రెండేళ్ళయినా ముఖ్యమంత్రి ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చనందుకు జూన్ 2వ తేదీన ఆయనపై రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లలో పిర్యాదులు చేస్తాము. ఆ తరువాత అన్ని నియోజక వర్గాలలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి, తెదేపా ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరిస్తాము,” అని బొత్స సత్యనారాయణ తెదేపాపై విమర్శలు గుప్పించారు.