నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవితపై గెలుపొందిన బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌కు అప్పుడే సెగ ప్రారంభమయింది. ఎంపీ అరవింద్ గెలవడానికి ప్రధాన కారణం పసుపు బోర్డు. నిజామాబాద్‌లోని ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల్లో పసుపు రైతులు ఆ సమయంలో భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. అంతకు ముందు ఎంపీగా ఉన్న కవిత పసుపుబోర్డు తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. కానీ బీజేపీ సర్కార్ ఇవ్వలేదు. అదే హామీని అరవింద్ ఇచ్చారు. ఆయన ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదు. బాండ్ పేపర్లు రాసిచ్చారు. దాంతో రైతులు ఆయనకు ఏకపక్షంగా మద్దతు పలికారు. ఆ విషంయ పోలింగ్ సరళిలో తేలింది. ఆ సమయంలో ఎన్నికల బరిలో కూడా… కొన్ని వందల మంది పసుపు రైతులు నామినేషన్లు వేసి పోటీకి నిలిచారు. రైతు దెబ్బకు కవిత ఓడిపోయారు.
అరవింద్ గెలిచారు. గెలిచినప్పటి నుండి పసుపు బోర్డు కోసం రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ పసుపు బోర్డు కాకుండా.. స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని అరవింద్ తీసుకు వచ్చారు. అయితే ఇది రైతుల్ని సంతృప్తి పరచలేదు. పసుపుబోర్డుపై ఆయన ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. తాజాగా రైతులు మళ్లీ నిరసనలకు దిగారు. దీంతో రైతులతో సమావేశమై.. వారిని కన్విన్స్ చేసేందుకు అర్వింద్ ప్రయత్నిస్తున్నారు. ఇలా జరిగిన ఓ సమావేశంలో రైతులు ఆయనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయితే 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని, రూ.15 వేలు మద్దతు ధర ఇప్పిస్తానని..నేను ఎక్కడా చెప్పలేదని ధర్మపురి అర్వింద్ ఎదురుదాడికి దిగారు.
పసుపు బోర్డు తెస్తానని మాత్రమే చెప్పానన్నారు. పసుపు ధరకు మద్దతు ధర కోసం మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. నిర్ణయం తీసుకోవాల్సింది మీరేనని కూడా తేల్చేశారు. దీంతో రైతులు అసంతృప్తికి గురయ్యారు. డౌన్ డౌన్ నినాదాలు చేశారు. బీజేపీలో యువ నేతల్లో ధాటిగా ఎదుగుతున్న అరవింద్‌కు పసుపుబోర్డు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎలాగోలా పసుపుబోర్డు ఏర్పాటు చేయించకపోతే.. రాజకీయంగా కూడా ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి.