మా కార్పొరేటర్ల జోలికి వస్తే.. మీ కార్పొరేట్ల సంగతి తేలుస్తామని టీఆర్ఎస్కు బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా అనడమే కాదు.. తొలి విడతగా..మైహోమ్ గ్రూప్ సంస్థలకు చెందిన అవకతవకలు అంటూ..కొన్ని వివరాలు ప్రకటించి.. సంచలనం రేపారు. జాతీయ సంపదైన ఖనిజ వనరులను మైహోమ్ సంస్థ దోచుకుందని.. అరవింద్ ఆరోపించారు. తెలంగాణతో పాటు.. ఆంధ్రలోని కొన్ని గనుల గురించిన వివరాలు బయటపెట్టారు. సీఆర్హెచ్, జయజ్యోతి సిమెంట్స్ అనే సంస్థలకు.. ఏపీ తెలంగాణలో ఉన్న లీజులు.. మైహోమ్ సంస్థ అక్రమంగా చేజిక్కించుకుందని ఆరోపించారు. మైనింగ్ చట్టం ప్రకారం అన్ని రకాల బదిలీలు వేలం ద్వారా జరగాలని, కానీ అలా జరగలేదన్నారు.
శ్రీజయ జ్యోతి సిమెంట్ 2013లో తమ యాజమాన్యాన్ని మైహోమ్కి మారిందని చెప్పిందన్నారు. మైహోమ్ వాళ్ళు తమకు జయ జ్యోతితో సంబంధం లేదని చెప్తున్నారన్నారు. తక్షణమే మౌహోమ్ మైనింగ్ కంపనీలను సీజ్ చేయాలని అరవింద్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే 2008 నుంచి 2019 వరకు విదేశీ పెట్టుబడుల నిబంధనలు ఉల్లంఘనలు జరిగాయని నిజామాబాద్ ఎంపీ ఆరోపిస్తున్నారు. మైహోమ్ సంస్థ వేల కోట్ల జాతీయ సంపదను అడ్డంగా దోచుకుందన్నారు. మైహోమ్ అక్రమాల మీద సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
మైహోమ్ మీద.. నిజామాబాద్ ఎంపీ తీవ్ర ఆరోపణలు చేయడం వెనుక.. నిజామాబాద్ స్థానిక ఎన్నికల రాజకీయం ఉంది. కవిత బరిలోఉన్న ఆ స్థానంలో మెజార్టీ కోసం.. ఇతర పార్టీలకు చెందిన వారిని టీఆర్ఎస్ నేతలు చేర్చుకుంటున్నారు. బీజేపీ కార్పొరేటర్లను కూడా చేర్చుకున్నారు. వీరందరికీ.. డబ్బులను…. మైహోమ్ సంస్థ ఇస్తుందన్న అనుమానంతో ఉన్న అరవింద్… తమ జోలికి రాకుండా ఉండేలా ఆ సంస్థను టార్గెట్ చేశారంటున్నారు.