మైహోం సంస్థ యజమాని జూపల్లి రామేశ్వరరావుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎడతెగని పోరాటం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో మైహోం సంస్థ అక్రమంగా మైనింగ్ చేస్తోందని..కొన్ని ఆధారాలతో ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు.. సంబంధింత అంశంపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ.. నోటీసులు పంపించగలిగారు. కానీ మైహోం సంస్థ.. ఇటు తెలంగాణ… అటు ఏపీ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులది. దీంతో ఆ నోటీసులు అలా ఉండిపోయాయి. దీనిపై అరవింద్ మండిపడుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలు సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ వద్దకు చేరాయి. అయితే ఆయన పక్కన పెట్టేశారు.
కేటీఆర్‌కు అత్యంత సన్నిహితులైన అధికారుల్లో మొదటి ఆఫీసర్ జయేష్ రంజన్. ఆయన మైహోంకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలనూ జయేష్ పట్టించుకోవటంలేదని ఎంపీ అరవింద్ మండిపడుతున్నారు. మైహోం సంస్థ నల్గొండ జిల్లాలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతోందని.. అలాగే గుంటూరులో వెయ్యి ఎకరాల అక్రమ మైనింగులున్నాయని అంటున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండానే… అటవీ భూముల్లో మైహోం సంస్థ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతోందన్నారు. ఆంధ్రలో ఐఏఎస్ అధికారులకు రూల్స్ తెలియవా అని అరవింద్ ప్రశ్నిస్తున్నారు.
క్రిమినల్స్‌ను కాపాడవద్దని మైహోం సంస్థ నుంచి రూ.వేల కోట్ల పెనాల్టీలు వసూలు చేసి… భరతమాత రుణం తీర్చుకోవాలని జగన్‌కు ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపునిచ్చారు. మైహోం సంస్థ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. మైహోం సంస్థ సిమెంట్ విభాగం కోసం మైనింగ్ నిర్వహిస్తోంది. ఈ మైనింగ్ అంతా అక్రమం అని అర్వింద్ వాదన. అరవింద్ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే అవకాశం లేదు. మరి కేంద్రమే మరింత చొరవతీసుకోవాల్సి ఉంది. అలాంటి పరిస్థితి ఉందో లేదో మరి..!