నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ … పండుగ పూట పనిగట్టుకుని వెళ్లి తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌ను కలిశారు. ఎందుకంటే.. మైహోమ్ సంస్థ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతోంది.. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడానికి. అసలు మైహోమ్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న పలుకుబడి ఏ స్థాయిలో ఉందో.. సాధారణ రాజకీయ నాయకుడికి కూడా తెలుసు. అయినప్పటికీ అరవింద్ ప్రత్యేకంగా వెళ్లి ఆ సంస్థపై ఫిర్యాదు చేశారు. గతంలో అరవింద్ ఈ సంస్థ అక్రమ మైనింగ్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కేంద్రం కూడా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరిందని కూడా ప్రకటించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ.. కేంద్రానికి వెళ్లలేదు. దీనిపై అరవింద్ ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టలేకపోయారు.
అప్పుడప్పుడు కేంద్ర మంత్రులతో సమావేశమై.. మైహోమ్ పై ఫిర్యాదు చేస్తున్నట్లుగా ప్రెస్నోట్లు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు కూడా అంతే. తాజాగా.. ఆయన ఆరోపణలు చేస్తున్న మైహోమ్ సంస్థకు నల్గొండలోనే.. మరో ఆరు వందల ఎకరాలు మైనింగ్ కోసం ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. దీని కోసం ప్రజాభిప్రాయసేకరణ కూడా నిర్వహించింది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో.. కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ… బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న విషయం మీడియాలో హైలెట్ అయింది. అయితే అరవింద్ మాత్రం.. ఆ లీజు కూడా ఇవ్వవొద్దని తెలంగాణ సర్కార్‌ను కోరుతున్నారు
నిజంగా మైహోంసంస్థ అక్రమాలపై సాక్ష్యాలుంటే.. అరవింద్ కేంద్ర ప్రభుత్వంతోనే విచారణకు ఆదేశించేలా చేయవచ్చు. ప్రైవేటు సంస్థల అక్రమాలపై దర్యాప్తులు చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలకు రాష్ట్రాల అనుమతి అవసరం లేదు. ఇలా ఎన్నో సంస్థలపై విచారణ చేపడుతున్నారు. ఒక వేళ కేంద్రం కూడా ఆసక్తి చూపించకపోతే.. కక్ష సాధింపులనుకుంటారంటే.. ఆయన కోర్టుకు పోవచ్చు. కోర్టులో సాక్ష్యాలు సమర్పించి.. సీబీఐ విచారణ ఆదేశాలు తీసుకు రావొచ్చు. కానీ ఆయన అడపాదడపా మీడియా సమావేశాల్లో ప్రకటనలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో.. ఇది రాజకీయ బెదిరింపు వ్యూహం తప్ప మరోకటి కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.