తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే… రోజుకో ధర్నా, వారానికో రాస్తారోకో, నెలకో దీక్ష అన్నట్టుగా తెరాస ఉద్యమించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అద్దం పడుతూ సుదీర్ఘకాలం నిరసనలు చేపట్టింది. అయితే, క్రమంలో నిరసనలు అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తుంటే… ఒంటికాలిపై కేసీఆర్ లేచేవారు! భావప్రకటనా హక్కును కాలరాస్తున్నారనీ, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారంటూ ఓ రేంజిలో గర్జించేవారు. కానీ, ఇవాళ్ల తెరాస సర్కారు చేస్తున్నదేంటీ..? అధికార పీఠంపైకి ఎక్కిన తరువాత వారు చేస్తున్నదేంటీ..? నిరసనలు, ఉద్యమాలను అడ్డుకోవడంపై ఇప్పుడు కేసీఆర్ సర్కారు విధానమేంటీ..? హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ విషయంలో ప్రభుత్వం ఆలోచనలు ఎలా మారుతున్నాయనేదే… ఈ ప్రశ్నలకు సమాధానం!
ఏ పార్టీవారుగానీ, ఏ ప్రజాలు సంఘాలుగానీ నిరసనలూ ఆందోళనలు చేపట్టాలంటే ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్‌లో కార్యక్రమాలు పెట్టుకుంటారు. కొన్నేళ్లుగా జరుగుతున్నది ఇదే. తెరాస కూడా గతంలో చాలాసార్లు ఇక్కడి నుంచే ఉద్యమించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, తాజాగా పోలీసు శాఖవారు ప్రతిపాదించింది ఏంటంటే… ధర్నా చౌక్‌ను ఇందిరా పార్క్ నుంచి మార్చేద్దామనీ! నగరానికి దూరంగా ఓ యాభై ఎకరాల భూమిని ధర్నా చౌక్ కోసం కేటాయిస్తే.. నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఉండవనీ, సామాన్య జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవనీ అంటున్నారు!
అచానక్.. సామాన్యుల ఇబ్బందుల గురించి ఆలోచిస్తున్నారే! ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న కార్యక్రమాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటున్నాయని ఇప్పుడే తెలిసిందా మహాప్రభూ…? సగటు భాగ్య నగర జీవికి ఇవన్నీ అలవాటైపోయిన అవస్థలు. ఎందుకంటే, నగరంలో ట్రాఫిక్ సమస్య కావొచ్చు, రోడ్ల సమస్య కావొచ్చు, వర్షాకాలంలో రోడ్లపై ఎదురీత కావొచ్చు, కుళ్లిపోయిన నాలాల లీకులు కావొచ్చు… ఇవన్నీ ఎప్పటికీ పరిష్కారం కావు, ప్రభుత్వాలకు అంత ‘డాష్’ లేదు అనే ఒక స్థాయి నమ్మకం సామాన్యుడికి వచ్చేసింది! అనూహ్యమైన మార్పుల్ని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. మరి, ధర్నా చౌక్ మార్పు వెనక ‘సామాన్యుడి కష్టాల తీర్చుడే ధ్యేయం’ అన్నట్టు బిల్డప్పులు ఇస్తే ఎవరు నమ్మేస్తారు..? ఇలాంటి నిర్ణయాల వెనక రాజకీయ ప్రయోజనాలే ఉంటాయి. జన ప్రయోజనాలు ఉండవు!
ఈ మధ్య కోదండరామ్ సాగించిన ఉద్యమ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఈ నిర్ణయంతోనే అర్థమౌతోంది. తెలంగాణలో రాబోయే రోజుల్లో నిరసనలు పెరుగుతాయని స్పష్టమౌతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు స్పందించడం మొదలుపెట్టిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఆ అసంతృప్తి ధర్నాచౌక్ వరకూ రాకూడదనేది కేసీఆర్ విజనరీ వ్యూహం! అందుకే, నగరానికి దూరంగా ఎక్కడో కొంత ప్లేస్ ఇచ్చేస్తే… ఆ గోలేదో అక్కడితోనే పోతుందని అనుకుంటున్నారు! ‘డీల్’ చేయడానికి ప్రభుత్వానికి కూడా ఈజీగా ఉంటుంది కదా! ధర్నా చౌక్ మార్పు వెనక ఇంతకుమించిన ప్రయోజనం కనిపించడం లేదు! ఇది ప్రజాప్రయోజనం కోసం కాదు… కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే..! మరి, ఈ ప్రతిపాదనపై మున్ముందు చోటు చేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయో…?