చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ హిస్టరీలో ఎప్పుడూ లేనంత ఘోరమైన ఆటతీరును కనబర్చింది. మధ్యలో ఫిక్సింగ్ కళంకంతో … కొన్ని సీజన్లు మిస్సయినా.. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మిస్టర్ కూల్ ధోనీ నాయకత్వంలో కూల్ విక్టరీస్ సాధిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. విజయాల కోసం తడబడుతోంది. పది మ్యాచ్‌లు ఆడి మూడంటే మూడు మాత్రమే గెలిచి.. అట్టడుగు స్థానంలో నిలిచింది. మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే చెన్నై ఆడాల్సి ఉంది. నాలుగు గెలిచినా పధ్నాలుగు పాయింట్లు మాత్రమే ఉంటాయి. ప్లే ఆఫ్స్‌కు చేరడానికి అవి సరిపోవు.
నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో చెన్నై ఘోర పరాజయం పాలైంది. అసలు పోరాడటమే ఆ టీమ్ మర్చిపోయిందా అన్నట్లుగా ఆటతీరు మారిపోయింది. ఇరవై ఓవర్ల పాటు ఆడి.. ఐదు వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎడారి పిచ్‌లు బ్యాటింగ్‌కు మరీ అంత కఠినంగా ఏమీ లేవు. అయినా ఎవరూ.. విజయం కోసం ఆడాలన్నట్లుగా ఆడలేకపోయారు. 126 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ని ఆడుతూ పాడుతూ సాధించింది.దీంతో చెన్నై ఇంటికెళ్లిపోవాల్సి వచ్చింది.
టోర్నీ ప్రారంభం నుంచి చెన్నైకు కష్టాలే. క్యాంప్‌కు ధోనీ రాగానే.. ఇంటర్నేషనల్ క్రికెట్కురిటైర్మెంట్ ప్రకటించేశారు. ఆ తర్వాత దుబాయ్‌కి వెళ్తే.. కరోనా వెంటాడింది. ఆలస్యంగా ప్రాక్టీస్ ప్రారంభించాల్సి వచ్చింది. ఆ చికాకుల్లో ఉండగానే.. హోటల్లో సరైన రూమ్ ఇవ్వలేదన్న కారణంగా రైనా ఇంటికెళ్లిపోయాడు. మళ్లీ రానే రానని తేల్చేశాడు. రాయుడు ఒక్క మ్యాచ్‌లో మ్యాచ్ విన్నర్‌గా నిలిచినా.. తర్వాత గాయపడ్డాడు. కోలుకుని మళ్లీ గ్రౌండ్లోకి వచ్చినా ఆటతీరు ఆ స్థాయిలో ఉండలేదు. డూప్లెసిస్ లాంటి ఆటగాళ్లు..ఆడిగే గెలిచింది..లేకపోతే లేదు. మొత్తానికి చెన్నై ఆట మారిపోయింది. పోరాడకుండా ఓడింది. ఇది.. ధోనీ ఫ్యాన్స్‌ను ఇబ్బందిపెట్టేదే.