శుక్రవారం ఆర్సీబీ, చెన్నై జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నైనే ఫేవరెట్. సొంత గడ్డ పై చెన్నైని ఓడించడం అంత సులభం కాదు. కానీ… బెంగళూరు చెన్నైని మట్టికరిపించింది. 50 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోవడానికి అనేక కారణాలు. అందులో ప్రధానమైన కారణం ధోనీ 9వ నెంబరు బ్యాటర్‌గా బరిలోకి దిగడం.
ధోనీ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన సందర్భాలు కోకొల్లలు. ముఖ్యంగా తాను గొప్ప ఫినిషర్. ఛేజింగుల్లో చాలా క్యాలుక్లేటెడ్ గా ఆడతాడు. కానీ గత సీజన్లో ధోనీ 9వ నెంబరు బ్యాటర్‌గా బరిలోకి దిగి విమర్శల పాలయ్యాడు. ఈసారీ అదే జరుగుతోంది. బెంగళూరు మ్యాచ్‌లో ధోనీ 9వ స్థానంలో ఆడాడు. తన కంటే ముందు అశ్విన్ బరిలోకి దిగాడు. చివర్లో వచ్చిన ధోనీ 16 పరుగుల్లో 30 పరుగులైతే చేశాడు కానీ జట్టుని గెలిపించలేకపోయాడు. ఎందుకంటే.. ధోనీ వచ్చే సమయానికే చెన్నై జట్టు ఓటమి ఖాయమైపోయింది. దాంతో ధోనీ వచ్చినా చేసేదేం లేకుండా పోయింది.
ధోనీ లాంటి వాడ్ని 9వ నెంబరులో దింపడం చాలా పెద్ద తప్పు. ఇది చెన్నై మేనేజ్ మెంట్ కావాలని చేస్తుందా, లేదంటే ధోనీనే ముందుగా బ్యాటింగ్ కి రావడానికి ఇష్టపడడం లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ధోనీ వయసు మీరిపోతోందన్నది వాస్తవం. తను ఇప్పటి వరకూ ఆడడమే గొప్ప. అలాగని ఫిట్ గా లేడా? అంటే వికెట్ల వెనుక చాలా చురుగ్గా ఉంటున్నాడు. బెంగళూరు తో మ్యాచ్‌లో సాల్ట్ ని స్టంపింగ్ చేసిన విధానం అవుట్ స్టాండింగ్. అలాంటి కీపింగ్ ధోనీకే సాధ్యం. ముంబై మ్యాచ్‌లోనూ సూర్య కుమార్ యాదవ్ ని ఇలానే స్టంపవుట్ చేశాడు. బ్యాటింగ్‌లో కూడా రెండు మెరుపు సిక్సర్లు కొట్టాడు. ఇలాంటి ధోనీని ముందుగా బ్యాటింగ్ కు దింపకపోవడం వ్యూహాత్మక తప్పిదం. నిజంగానే ధోనీకి బ్యాటింగ్ చేయడం ఇష్టం లేదు, తాను ముందుగా వచ్చినా పెద్దగా ప్రయోజనం లేదంటే జట్టు ప్రయోజనాలను పణంగా పెట్టి ధోనిని ఎంపిక చేయడంలో అర్థం లేదు. ధోనీని ఇంత ఆలస్యంగా బ్యాటింగ్ కు దింపడంపై మాజీలు కూడా విస్తుపోతున్నారు. హర్ష భోగ్లే, ఇర్ఫాన్ పటాన్, రాబిన్ ఊతప్ప ఈ విషయంలో తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ధోనీ ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే చెన్నై కచ్చితంగా గెలిచేదని, కనీసం… చివరి వరకూ పోరాడేదని, మ్యాచ్ ఇలా వన్ సైడెడ్ గా ముగిసేది కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధోనీ ప్లేస్మెంట్ పై ఇప్పటికైనా చెన్నై జట్టు ఓ నిర్ణయానికి వస్తే మంచిది.