సుధీర్ఘ విరామం తరవాత.. మైదానంలోకి అడుగుపెట్టాడు ధోనీ. బ్యాటుతో.. రాణించే అవకాశం రాలేదు గానీ, వికెట్ల వెనుక చరుకుదనంలోనూ, కెప్టెన్సీ నిర్ణయాలలోనూ తనకు ఏమాత్రం తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. ఒక్క ఐపీఎల్ తప్ప, అన్ని ఫార్మెట్లలోనూ రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ… ఈ ఐపీఎల్లో ఎలా ఆడతాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అందుకే ఈ సీజన్లో తొలి మ్యాచ్ ముంబై – చెన్నై మధ్య అనేసరికి.. టోర్నీ ఆరంభ మ్యాచ్‌కి మరింత క్రేజ్ వచ్చింది. అందరి దృష్టీ ధోనీపైనే.
మైదానంలో ధోనీ తీసుకున్న చాలా నిర్ణయాలు..ఆ జట్టు విజయానికి కారణమయ్యాయి. టాస్ గెలిచి.. బౌలింగ్ తీసుకోవడంతో.. ధోనీ ఆట మొదలైంది. ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్, డికాక్‌లు చెలరేగిపోతున్నప్పుడు, పవర్ ప్లేలో ఉండగానే స్పిన్నర్ పీయూష్ చావ్లాని రంగంలోకి దింపాడు ధోనీ. రోహిత్ శర్మ వికెట్ తీసేముందు… ధోనీ ఫీల్డింగ్‌ని కొద్దిగా మార్చి.. రోహిత్ ని ఊరించాడు. ధోనీ – పీయూష్ ల బుట్టలో.. పడిపోయి వికెట్ సమర్పించుకున్నాడు రోహిత్. ఆ వెంటనే డికాక్ వెనుదిరిగాడు. కీలకమైన సమయంలో.. ధోనీ చేసిన బౌలింగ్ మార్పులు మంచి ఫలితాల్ని ఇచ్చాయి. కనీసం 180 పరుగులు చేస్తుందనుకున్న ముంబై.. 162 పరుగులకే పరిమితమైపోయింది.
బ్యాటింగ్ ఆర్డర్ లోనూ ధోనీ మార్పులు చేశాడు. తనకంటే ముందు జడేజా, కురియన్‌లను పంపాడు. వాళ్లద్దరూ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అవ్వడం చెన్నైకి కలిసొచ్చింది. కురియన్ రెచ్చిపోయి ఆడడంతో చెన్నై అనుకున్న లక్ష్యాన్ని ముందుగానే పూర్తి చేయగలిగింది. జడేజా స్థానంలో ధోనీ వచ్చుంటే… కావల్సిన రన్‌రేట్ తో పరుగులు చేయకుంటే తప్పకుండా ధోనీని విమర్శించేవాళ్లు మళ్లీ గళం విప్పేవారు. ధోనీకి వయసైపోయిందని, టీ 20కి పనికిరాడని అనేవారు. కానీ.. ధోనీ వాళ్లకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆటని ముగించే ఛాన్స్… మిగిలిన వాళ్లకు ఇచ్చి, తాను అవతలి ఎండ్ లో ఉండిపోయాడు. ధోనీ మాయాజాలం మొదటి మ్యాచ్‌లోనే చూసే అవకాశం వచ్చింది. ఇక బ్యాటింగ్ లోనూ రెచ్చిపోవడమే మిగిలివుంది.