క్రికెట్లోకి చాలా మంది క్రీడాకారులు ఎంట్రీలు, రీ ఎంట్రీలు ఇస్తూ ఉంటారు. వాళ్ళలో కొంతమంది చాలా ఎక్కువ కాలమే క్రికెట్ ఆడతారు. కానీ క్రికెట్‌కే వన్నె తెచ్చే స్థాయిలో… వాళ్ళదంటూ ఓ స్పెషల్ మార్క్ వేయడం మాత్రం చాలా తక్కువ మంది ప్లేయర్స్‌కే సాధ్యమవుతుంది. ఇండియన్ క్రికెటర్స్ వరకూ చూసుకుంటే కపిల్ దేవ్, కెప్టెన్సీ విషయంలో సౌరవ్ గంగూలీ, సెంచరీల విషయంలో సచిన్ టెండూల్కర్…అలాగే ఇప్పుడు అన్ని విధాలుగానూ ది బెస్ట్ అని అనిపించుకోవాలని ప్రతి క్షణం తపిస్తున్న విరాట్ కోహ్లిలు వారిలో కొందరు.
ధోనీ కూడా ఓ విషయంలో ఇదే జాబితాలో నిలుస్తాడు. ఎం.ఎస్. ధోనీ కంటే ముందు వికెట్ కీపింగ్ చేసిన ప్లేయర్స్ అందరితో పోల్చుకుంటే ధోనీ చేతులకు స్పీడ్ చాలా ఎక్కువ. అలాగే ధోనీ అబ్జర్వేషన్ పవర్ కూడా అమోఘం. ధోనీకి వెనుక వైపు కూడా కళ్ళు ఉన్నాయోమో అని డౌట్స్ వచ్చే రేంజ్లో ఉంటుంది ఆ పవర్. స్టంపింగ్స్ చేసేటప్పుడు ధోనీ చేతిలోకి ఎప్పుడు బాల్ వచ్చిందో…బెయిల్స్ ఎప్పుడు ఎగిరిపోయాయో తెలియాలంటే రీప్లేలో చూసుకోవాల్సిందే. అంతటి వేగం ధోనీ సొంతం. ఇక రన్ అవుట్స్ విషయంలో అయితే ధోనీ వికెట్ల వెనకాల నిలబడి ఉన్నా, ముందు నిలబడి ఉన్నా తేడా ఏమీ ఉండదు. వికెట్లను చూస్తూ త్రో విసిరినంత కచ్చితంగా వెనుక వైపు నుంచి కూడా కచ్చితంగా, షార్ప్‌గా బాల్ని త్రో చేసి క్షణాల్లో బెయిల్స్‌ని గిరాటేయగలడు. ఈ రోజు న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్ డే మ్యాచ్‌లో కూడా అదే అద్భుతం చేశాడు ధోనీ. అప్పటి వరకూ జాగ్రత్తగా డిఫెన్స్ ఆడుతూ క్రిజులో కుదురుకుని ఇక భారీ హిట్టింగ్‌కి రెడీ అవుతున్న న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్‌మెన్‌ని తనకే సాధ్యమైన, అద్భుతమైన కీపింగ్ స్కిల్స్‌తో పెవిలియన్ పంపించాడు ధోనీ. వికెట్లకు అటువైపు తిరిగి ఉన్న ధోనీ… ఫీల్డర్ విసిరిన త్రోని క్యాచ్ చేయడం, అదే స్పీడ్‌తో వికెట్లను చూడకుండానే వెనుకకు త్రో విసిరి వికెట్లను గిరాటేయడం క్షణాల్లో జరిగిపోయింది. ధోనీ మేజిక్‌కి రాస్ టేలర్ కూడా ఆశ్ఛర్యపోయాడు. ఇలా చేస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు అన్న అర్థం వచ్చే ఓ నవ్వు నవ్వి నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. విరాట్ కోహ్లి కూడా ధోనీని అభినందించడం కనిపించింది. అందుకే ఈ విషయంలో మాత్రం ధోనీ…ది బెస్ట్ అని కచ్చితంగా చెప్పొచ్చు.