తని వరువన్ రీమేక్‌గా రాబోతోంది ధృవ. ఆల్రెడీ తమిళంలో పెద్ద హిట్ సాధించిన చిత్రమిది. సాధారణంగా హిట్ చిత్రాల్ని రీమేక్ చేసేటప్పుడు వీలైనంత వరకూ యాజ్ ఇట్ ఈజ్ గా దించేయాలనుకొంటారు. దర్శకుడు ప్రతిభావంతుడైతే, ఆ దర్శకుడిపై నమ్మకం ఉంటే మార్పులు చేర్పులకు అవకాశం ఇస్తుంటారు హీరోలు. మరి ధృవ కాపీ పేస్ట్ సినిమానా? లేదంటే సురేందర్ రెడ్డి మార్పులు, చేర్పులూ చేశాడా? అనే ఆసక్తి నెలకొంది. ఆ సంగతి తేలాలంటే ఈనెల 9 వరకూ ఆగాల్సిందే అనుకొన్నారంతా. అయితే.. అంత వరకూ వేచి చూడాల్సిన పని లేదు. ఇది.. తని ఒరువన్కి కాపీ పేస్ట్ లాంటి సినిమానే. ఈ విషయాన్ని ఈ చిత్రబృందంలో కీలక సభ్యుడైన అరవింద్ స్వామినే చెప్పేశాడు.
రీమేక్ సినిమాని తీయాలనుకొన్నప్పుడు రెండు రకాలుగా ఆలోచిస్తుంటారని, ఉన్నది ఉన్నట్టు తీయడానికి కొంతమంది ప్రయత్నిస్తే.. మరికొంతమంది మార్పులూ, చేర్పులూ చేస్తారని, సురేందర్ రెడ్డి మాత్రం మాతృకలోని సన్నివేశాల్ని గౌరవించి వాటిని అలానే తీశారని చెప్పుకొచ్చాడు. తన పాత్రలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని, తనిఒరువన్ లో ఏం చేశానో, ఇందులోనూ అదే చేసేశాని గుట్టు విప్పేశాడు. ధృవ ట్రైలర్ చూసినా అదే విషయం స్పష్టమవుతోంది. షాట్లతో సహా.. కొన్ని సీన్లను ఉన్నది ఉన్నట్టుగానే తీసినట్టు తెలిసిపోతోంది. కేవలం చరణ్ కట్టడి చేయడం వల్లే.. సురేందర్‌రెడ్డి కొత్తగా ఆలోచించే అవకాశం రాలేదని… తని ఒరువన్ మ్యాజిక్ రిపీట్ చేయాలంటే కాపీ పేస్ట్ చేయడం ఒక్కటే శరణ్యమని చరణ్ చెప్పాడని, సురేందర్ రెడ్డి దాన్ని పాటించాడని చెబుతున్నారు. అయితే రకుల్‌తో లవ్ ట్రాక్ మాత్రం కాస్త మారిందని సమాచారం.