సంగం డెయిరీలో అక్రమాలంటూ పోలీసులు అరెస్ట్ చేసిన టీడీపీ నేత ధూళిపాళ నరేంద్రకు కరోనా పాజిటివ్‌గా తేలింది. రెండు రోజుల నుంచి ఆయనకు మైల్డ్ సింప్టమ్స్ ఉండటంతో ఆయనకు టెస్టులు చేయించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు టెస్టులు చేయించడంతో పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే ఆయన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. పాజిటివ్ వస్తే ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశించింది. ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసిన రోజున.. వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ రోజున కరోనా టెస్ట్ కూడా చేశారు. అప్పుడు నెగెటివ్‌గా తేలింది.
ఇప్పుడు జైల్లోనో… పోలీసులు విచారణ పేరుతో అటూ ఇటూ తిప్పడం వల్లనో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. కరోనా అంటించడానికే టీడీపీ నేతల్ని అరెస్ట్ చేసి.. తిప్పుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సమయంలో… నరేంద్రకు పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది. అదుపులోకి తీసుకున్న రోజున.. సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకూ నెగెటివ్ వచ్చింది.. కానీ ఆయన రెండు రోజుల నుంచి కరోనాతో బాధపడుతున్నారు. ఆయన కుటుంబసభ్యులు కోర్టులో పిటిషన్లువేసుకుని చికిత్స కోసం.. ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. మరో నిందితుడు..మాజీ సహకార శాఖ రిజిస్ట్రార్ గుర్నాధంకు మొదటి రోజు పాజిటివ్ వచ్చింది.
అయితే ఆర్టీపీసీఆర్లో నెగెటివ్ వచ్చిందని ఆయననూ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తానికి అసలు కేసే లేదని… తప్పుడు కేసులు పెట్టి…టీడీపీ నేతలకు కరోనా అంటించడానికే.. విచారణల పేరుతో తిప్పుతున్నారని దేవినేని ఉమలాంటి నేతలు ఆరోపిస్తున్న సమయంలో… నరేంద్రకు పాజిటివ్‌గా తేలింది. దీనిపై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.