రాజకీయ ప్రసంగాలు సాగించడంలో ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క శైలి ఉంటుంది. కొందరు అచ్చంగా విధానాల గురించి మాత్రమే మాట్లాడుతారు. తాము చెప్పదలచుకున్న విషయాన్ని సిద్ధాంత బలంతో సమర్థించుకుంటూ వివరిస్తారు. కానీ ఇలాంటిది ఒక వర్గం సభికుల వద్దనే ఉపయోగపడుతుంది. అదే విషయాలకు చతురోక్తులు, సామెతలు, జోకులు వంటి తాలింపు జతచేసినప్పుడే.. మాస్‌ను ఆకర్షించే బహిరంగ సభ ప్రసంగం అవుతుంది. అయితే ఈ క్రమంలో జనాన్ని ఆకట్టుకుంటున్నాం అనే భ్రమలో నాయకులు కొన్ని చవకబారు జోకులకు కూడా దిగుతుంటారు. ఇలాంటివి ఒకస్థాయి దాటిన నాయకులకు బాగుండవు. కానీ ఇప్పుడేం జరుగుతోంది.. అలాంటి చవకబారు డైలాగులు ఏ సరిహద్దురేఖ దాటిన తర్వాత బాగుండవో దానిని నేతలు మరచిపోతున్నారు. అందుకే.. అటు ప్రధాని మోడీ గానీ, ఆయన ప్రధానంగా కాన్సంట్రేట్ చేస్తున్న మమతా బెనర్జీ గానీ.. అలాంటి విమర్శలే చేస్తున్నారు.
సాధారణంగా పిల్లలు ఆడుకునే పిల్లతరహా ఆట ఒకటి ఉంటుంది. ఒకడి పేరు హరి అనుకుందాం.. ‘హెచ్.ఏ.ఆర్.ఐ’ హరి అనేది వాడి పేరు అయితే.. ”హీరోయిక్, ఆసమ్, రెడీఫర్ హెల్ప్, నాలెడ్జి ఫెలో” అంటూ పేరులోని నాలుగు అక్షరాలకు పిచ్చిపిచ్చిగా వాడొక అబ్రీవియేషన్ తయారుచేసుకుంటాడు. నిజం చెప్పాలంటే ఇదొక పిల్లతరహా ఆట. వెంకయ్యనాయుడు లాంటి మొన్నటి తరానికి క్రియేటివ్ నాయకులు తమ ప్రసంగాల్లో ఇప్పటికీ ఈ ఆట ఆడుతూనే ఉంటారు. అయితే మోడీ కూడా అంత చిల్లరగా అదే ఆట ఆడితే ఏం బాగుంటుంది.
మోడీ పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ప్రత్యర్థి టీఎంసీని టెర్రర్, మౌత్, కరప్షన్ పార్టీగా వర్ణిస్తూ ఒక అబ్రీవియేషన్ క్రియేట్ చేశారు. ఆ క్రియేటివిటీకి ఆయన మురిసిపోయి ఉండవచ్చు. ఇప్పుడు మమతా దీదీ దానికి జవాబుగా బీజేపీని భయానక్ జైల్ పార్టీగా అభివర్ణిస్తున్నారు.
అయినా ఇలాంటి చిల్లర అబ్రీవియేషన్లకు ప్రజలు ముగ్ధులై పడిపోయే రోజులు ఇంకా మిగిలి ఉన్నాయని నాయకులు అనుకుంటే భ్రమ. మంచి పరిపాలన ఎవరు అందించగలరనే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి జనం ఎదుట ఇలాంటి గిమ్మిక్కులు పనిచేయవు అని వారు తెలుసుకుంటే బాగుంటుంది.