వైద్య మంత్రి విడదల రజనీ గుంటూరులో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏ మూహుర్తాన ఆమె అడుగు పెట్టారో కానీ అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. డబ్బుల్ని మంచినీళ్లలా ఖర్చు పెట్టేస్తున్నారు కానీ.. ప్రజలకు మంచినీళ్ల విషయంలో మాత్రం తప్పటడుగు పడింది. మున్సిపల్ వాటర్ కలుషితంగా మారడంతో .. వాటిని తాగుతున్న జనం డయేరియా బారిన పడి ఆస్పత్రి పాలవుతున్నారు. గత వారం రోజుల్లో నలుగురు చనిపోయారు.
గుంటూరు నగరాన్ని డయేరియా పట్టిపీడిస్తోంది. గుంటూరులో వాటర్ క్యాన్లు కొని తాగే వారు కొద్ది మందే ఉంటారు. ఎక్కువ మంది మున్సిపల్ వాటర్ కే ప్రాధాన్యం ఇస్తారు. ఆ మున్సిపల్ వాటర్ వల్ల ఇప్పుడు ప్రాణఆలు పోతున్నాయి. పెద్ద ఎత్తున డయేరియా రోగులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీనిపై మొదట్లో కొన్ని వివరాలు బయట పెట్టినా తర్వాత మాత్రం ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. ఓ సారి మీడియా సమావేశంలో వైద్య మంత్రి విడదల రజనీ.. పేదల ప్రాణాలే కదా అన్నట్లుగా మాట్లాడారన్న ఆరోపణలు వచ్చాయి.
గుంటూరు జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు. గుంటూరు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. వైద్య మంత్రిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో చురుకుగా పని చేసి.. అందరిలోనూ నమ్మకం కలిగించాల్సింది పోయి… విడదల రజనీ భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. మంచినీరు వస్తాయని భరోసా ఇవ్వలేకపోతున్నారు. దీనికి కారణం ఏమిటో కానీ ఇప్పుడు గుంటూరు ప్రజలు నీళ్లు కూడా కొనుక్కోవాల్సి వస్తోంది.