గీతా ఆర్ట్స్‌లో వరుసగా రెండు సినిమాలు చేశాడు పరశురామ్. ఒకటి.., శిరీష్‌తో అయితే మరోటి… విజయ్ దేవరకొండతో. నిజానికి అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాలని ఆ కాంపౌండ్ లోకి అడుగుపెట్టాడు పరశురామ్. కొన్ని కథలూ వినిపించాడు. `గీత గోవిందం` కథ బన్నీతోనే చేయాలనుకున్నాడు పరశురామ్. అది సెట్ అవ్వలేదు. ఇప్పుడు మహేష్‌తో `సర్కారు వారి పాట` తీశాడు. అయితే ఈ కథ కూడా బన్నీకి వినిపించాడని, బన్నీ `నో` అన్న తరవాతే మహేష్ దగ్గరకు వెళ్లిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. దీనిపై పరశురామ్ క్లారిటీ ఇచ్చేశాడు.
“ఇది మహేష్ ని దృష్టిలో ఉంచుకుని రాసుకున్న కథ. ఎవ్వరికీ చెప్పలేదు. ఈ కథ విన్న ఒకే ఒక్క హీరో.. మహేష్ మాత్రమే. వినగానే ఆయనకు నచ్చింది. మహేష్‌కి తప్ప మరెవ్వరికీ ఈ కథ సూట్ కాదు. ఇది మహేష్ కోసమే పుట్టింది. ఆయనమాత్రమే చేయగలరు. ఫస్ట్ సిట్టింగ్ లోనే మహేష్ ఓకే చేసిన కథ ఇది. ఇది వరకు ఆయనకూ,నాకూ అస్సలు పరిచయమే లేదు. మహేష్ అప్పాయింట్ మెంట్ తీసుకొనేసరికి.. నా గురించి ఆయనకు ఏం తెలీదు కూడా. కేవలం కథ నచ్చి.. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు“ అని క్లారిటీ ఇచ్చాడు పరశురామ్. తన తదుపరి సినిమా నాగచైతన్యతోనే అని మరోసారి స్పష్టం చేశారు. `గీత గోవిందం` పూర్తయిన వెంటనే చైతూతో ఓ సినిమా చేయాలి. అప్పటి సమీకరణాల్లో ఆ సినిమా చేయడం కుదర్లేదు. అప్పటి ఆ కథతోనే ఇప్పుడు చైతూతో సినిమా పట్టాలెక్కిస్తున్నాడు.