పార్టీలోకి చేరికల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని నారా లోకేష్ డిసైడ్ అయినట్టు ఉన్నారు. టీడీపీలో చేరుతామంటూ వైసీపీ నేతలు క్యూ కడుతున్నా, సన్నిహిత నేతల ద్వారా రాయబారం కొనసాగిస్తున్నా చేరికలకు ఇప్పటికప్పుడు తొందరేమి లేదని రిజెక్ట్ చేస్తున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేతల విషయంలో కాస్త కటువుగా వ్యవహరించాలని నిర్ణయించిన లోకేష్..పార్టీకి గతంలో నష్టం చేసిన నేతల పట్ల కూడా ఇదే వైఖరి అవలభించాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఆమంచి.. చీరాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో టీడీపీపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీలో కాపులకు ప్రాధాన్యత లేదని, అణగదొక్కుతున్నారన్నారని ఆరోపించారు.
అయితే, 2024 ఎన్నికల్లో ఆమంచికి జగన్ టికెట్ నిరాకరించారు. చీరాల టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు కేటాయించగా.. ఆమంచి ఇంచార్జ్ గా ఉన్న పర్చూర్ లో మరో నేతను బరిలో నిలిపారు. జగన్ వైఖరిని నిరసిస్తూ ఆమంచి కాంగ్రెస్ లో చేరి చీరాల నుంచి పోటీ చేసి మరోసారి పరాజయం పాలయ్యారు. అయితే ,రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో టీడీపీకి చెందిన ఓ మంత్రి ద్వారా ఆమంచి తిరిగి సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
ఈ విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. గతంలో పార్టీని వీడిన సమయంలో టీడీపీపై ఆమంచి తీవ్ర విమర్శలు చేశారని, అలాంటి నేతలను తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆమంచి రాజకీయ భవితవ్యం ఎటూకాకుండా పోయింది.