సదరన్ కౌన్సిల్ భేటీకి తిరుపతి వచ్చిన అమిత్ షా ఏపీ బీజేపీ నేతలతో భేటీ అయ్యేందుకు ప్రత్యేకంగా తన షెడ్యూల్‌ను ఓ రోజు పొడిగించుకున్నారు. ఆదివారం రాత్రి ఆయన ఢిల్లీ తిరిగి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ ఏపీ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయడానికి సోమవారం కూడా తిరుపతిలో ఉన్నారు. ఉదయం నుంచి దాదాపుగా నాలుగు గంటల పాటు వారితో సమావేశమయ్యారు. సమావేశం తర్వాత బయటకు వచ్చిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బాగా కనిపిస్తున్నందున .. బీజేపీని ప్రత్యామ్నాయంగా నిలబెట్టేందుకు ప్రయత్నించాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారని మీడియాకు చెప్పారు.
అయితే అంతర్గతంగా ఏం జరిగిందన్నదానిపై పలు రకాల కథనాలు మీడియాలో వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అనుకూల చానల్‌గా ముద్రపడిన ఏబీఎన్‌లో .. ఆంధ్రజ్యోతిని బీజేపీ నేతలు బహిష్కరించడంపై క్లాస్ తీసుకున్నారని ప్రకటించారు. అదే సమయంలో అసలు ఏ కవరేజీ ఇవ్వని సాక్షిని ఎందుకు బ్యాన్ చేయలేదని అమిత్ షా తమ నేతలను ప్రశ్నించినట్లుగా చెప్పుకుంది. అదే సమయంలో అమరావతికి మద్దతుగా తీర్మానం చేసి ఇప్పుడు మద్దతు ఇచ్చే వారిపై ఎందుకు చర్యలు తీసుకుంటారని కూడా అమిత్ షా ప్రశ్నించినట్లుగా చెప్పుకున్నారు. అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనాలని దిశానిర్దేశం చేసినట్లుగా చెప్పుకున్నారు. బీజేపీ నేతలు రైతుల పాదయాత్రలో పాల్గొంటే ఇదే నిజమని అనుకోవాలి.
అయితే ఏపీ అధికార పార్టీకి సన్నిహితమైన చానల్‌గా పేరు తెచ్చుకున్న ఎన్టీవీ మాత్రం ఆంధ్రజ్యోతి ప్రస్తావన తీసుకు రాకపోయినా .. వైసీపీకి మద్దతుగా మాట్లాడుతున్న సునీల్ ధియోధర్, జీవీఎల్ నరసింహారావులపై అమిత్ షా మండిపడినట్లుగా చెప్పింది. వైసీపీ మనకు ప్రధాన శత్రువుని.. ప్రజావ్యతిరేకత పెరుగుతున్నందున ప్రభుత్వతంతో సాన్నిహిత్యంగా ఉండకూడదని తేల్చి చెప్పినట్లుగా చెబుతున్నారు. అదేసమయంలో గంట సేపు టీడీపీ నుంచి వచ్చిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లతో అమిత్ షా విడిగా భేటీ అయ్యారని కూడా ప్రకటించారు. ఏం చర్చించారో కానీ మొత్తానికి ఏపీ రాజకీయాలపై అమిత్ షా ఓ పూట దృష్టి పెట్టారంటే ఏదో విశేషం ఉండే ఉంటుందని భావిస్తున్నారు.