‘భారతీయుడు 2’ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజే విడుదలైంది. తొలి రోజే ఫ్లాప్ టాక్ మూటగట్టుకొంది. అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయిందని ప్రేక్షకులు, విమర్శకులూ తేల్చేశారు. తమిళనాట కమల్ హాసన్ వీర ఫ్యాన్స్ కూడా ‘శంకర్ ఇలాంటి సినిమా తీశాడేంటి’ అంటూ వాపోతున్నారు. ఈ రిజల్ట్ చాలామందికి షాక్ ఇచ్చి ఉండొచ్చు. కానీ అనిరుధ్‌కి కాదు.
‘భారతీయుడు 2’కి అనిరుధ్ సంగీత దర్శకుడిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రీ రికార్డింగ్ ఇచ్చేటప్పుడే రిజల్ట్ కూడా టీమ్ కి చెప్పేశాడట. ‘నాకేదో తేడా కొడుతోంది.. కొంచెం ట్రిమ్ చేయండి’ అంటూ శంకర్‌కు సలహా ఇచ్చాడట. అనిరుధ్ అభిప్రాయాన్ని గౌరవించిన శంకర్.. ఈ సినిమాని కాస్త ట్రిమ్ చేశాడట. అలా చేసినా మూడు గంటల ఫుటేజ్ వచ్చింది. రీరికార్డింగ్ లో ఎక్కడా అనిరుధ్ మార్క్ లేదు. సినిమా నచ్చక.. తను మనసు పెట్టలేకపోయాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ప్రమోషన్లలో సైతం అనిరుధ్ పెద్దగా కనిపించలేదని చెబుతున్నారు.
‘భారతీయుడు 2’, ‘భారతీయుడు 3’ అంటూ ఈ కథని శంకర్ రెండు భాగాలుగా తీస్తానంటే కమల్ హాసన్ కూడా అడ్డు చెప్పాడట. ‘ఒకే భాగంలా తీస్తే బాగుంటుంది కదా’ అని సలహా ఇచ్చాడట. కానీ అప్పటికే సినిమా బడ్జెట్ పెరిగిపోయింది. దాన్ని రాబట్టాలంటే రెండు భాగాలుగా విడుదల చేసి సొమ్ము చేసుకోవాలి. అందుకే తప్పని పరిస్థితుల్లో పార్ట్ 3 అంటూ ఈ కథని పొడిగించాల్సివచ్చింది. పార్ట్ 3ని కూడా ఇందులోనే కలిపేస్తే… కచ్చితంగా రిజల్ట్ ఉండేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.