వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలను ఇప్పుడు స్పీకర్ ఆమోదించారు. ఏప్రిల్ ఆరో తేదీన వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. జూన్ ఇరవై ఒకటో తేదీన ఆమోదించారు. రెండున్నర నెలల తర్వాత స్పీకర్ ఎందుకు ఆమోదించారు..? దీని వెనుక ఏదైనా వ్యూహం ఏదైనా దాగి ఉందా..? అనే అనుమానం సహజంగా వస్తుంది.
ఉపఎన్నికలు రాకూడదనే ఆలస్యం..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉపఎన్నికలు వస్తాయా రావా అన్నది కీలకం. రాజీనామా చేసిన స్థానాలకు ఉపఎన్నికలు కోరుకుంటున్నారని నేను అనుకోను. ఎందుకంటే…2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి. రాజీనామా చేసిన స్థానాలకు ఉపఎన్నికలు వచ్చి.. వైసీపీ అన్ని స్థానాలనూ కైవసం చేసుకున్నా.. వారి స్థానాలు వారికి వస్తాయి. అదే ఒకటి, రెండు స్థానాలను పోగొట్టుకుంటే.. వైసీపీ బలహీనపడిందనే ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ ప్రారంభిస్తుంది. అందుకే ఉపఎన్నికలు రావాలని… వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ.. ఆ పార్టీ ఎంపీలు కానీ కోరుకోరు. అంటే ఉపఎన్నికలు వస్తే… ఎలాంటి లాభం ఉండదు. అయితే నష్టమే.
పదవీ కాలం ఏడాదిలోపు ఉంటే ఉపఎన్నికలు రావు..!
సాధారణంగా ఎవరైనా సభ్యులు రాజీనామాలు చేస్తే ఆరు నెలల్లో ఉపఎన్నికలు వస్తాయని అనుకుంటారు. కానీ ప్రజాప్రాతినిధ్యం చట్టం 171A స్పష్టంగా ఏమని చెబుతోందంటే.. ఓ లోక్‌సభ సభ్యుడు ఎవరైనా రాజీనామా చేస్తే ఆరు నెలల్లోగా ఎన్నికలు జరపాలి. కానీ…ఒక వేళ .. రాజీనామా చేసిన సభ్యుని… పదవీ కాలం.. ఏడాదిలోపే ఉంటే.. ఈ ఆరు నెలల్లో ఎన్నికలు జరపాలన్న నిబంధన వర్తించదు అని చెబుతుంది. రాజీనామాలు సమర్పించిన ఏప్రిల్ ఆరో తేదీ తర్వాత నెల రోజుల్లో రాజీనామాలు ఆమోదించి ఉంటే ఉపఎన్నికలు వచ్చి ఉండేవి. కానీ జాగ్రత్తగా లెక్కలు వేసుకుని 2019 ఎన్నికలకు ముందు ఏడాది కూడా లేని సమయం చూసుకుని.. రాజీనామాలు ఆమోదించారు.
ఉపఎన్నికలు రాకుండా స్పీకర్ సహకరించారు..!
ఉపఎన్నికలు రాకుండా.. రాజీనామాలు ఆమోదించడానికి.. స్పీకర్ సహకరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపఎన్నికలు రాకుండా బీజేపీ సహకరించింది. బీజేపీకి, వైసీపీకి మధ్య లోపాయికారీ సంబంధాలున్నాయన్న విమర్శలకు ఇది బలాన్ని చేకూరుస్తోంది. బీజేపీ, వైసీపీ మధ్య అవగాహన లేకపోతే.. రాజీనామాలు అప్పుడే ఆమోదించి ఉండేవారు. ఉపఎన్నికలు వచ్చి ఉండేవి. ఎవరైనా రాజీనామాలు చేస్తే.. ఆమోదించే విషయంలో స్పీకర్‌కు టైమ్ లిమిట్ లేదు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం..!
లోక్‌సభలో ఏదైనా సీటు ఖాళీ అయితే ఆరు నెలల్లో ఎన్నిక నిర్వహించాలన్నది ఎన్నికల కమిషన్ అబ్లిగేషన్.. అలాగే స్పీకర్ ఎవరైనా రాజీనామాలు చేస్తే.. ఆమోదించడమో.. తిరస్కరించడమో చేయాలనే అబ్లిగేషన్ ఉంటుంది. ఈ రెండు అబ్లిగేషన్ల మధ్య బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. రెండు రాజ్యాంగ వ్యవస్థల అబ్లిగేషన్ల మధ్య బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎన్నికలు జరపడమనేది ఇక్కడ కీలకం. ఒక వేళ రాజీనామాలు ఆమోదిస్తే.. ఉపఎన్నికలు నిర్వహించడానికి అవకాశం ఉన్న రీతిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. అంటే.. స్పీకర్ ప్రజాప్రాతినిధ్యచట్టం స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకోలేదు. ఎన్నికలు జరపడం అనేది కీలకం.
అధికార దుర్వినియోగం చేసిన స్పీకర్..!
చట్టసభల్లో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉందంటే.. ఆయా స్థానాల ప్రజలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉండదు. అందువల్ల ఎన్నికలు నిర్వహించాలనేది అబ్లిగేషన్. ఇప్పుడు ఆ అబ్లిగేషన్‌ను ఎన్నికల సంఘం నిర్వహించలేని విధంగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల కచ్చితంగా స్పీకర్ తన అధికారాల్ని ఒక రకంగా దుర్వినియోగం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు, ప్రజాప్రాతినిధ్య చట్టం స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ.. స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం.. బీజేపీ ఎంపీగా ఎన్నికై.. స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సుమిత్రామహాజన్‌కు ఏమిటి..?
వైసీపీ ఎంపీల రాజీనామాలు, ఆమోదం విషయంలో తేలిందేమిటంటే.. బీజేపీ, వైసీపీ రెండూ.. పరస్పర అవగాహనతోనే రాజీనామాల వ్యవహారాన్ని నడిపించాయి.