పార్టీ మారాలనుకునే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇదే మంచి సమయం అని భావిస్తున్నారా? అధికార పార్టీలో ప్రాధాన్యత దక్కాలంటే ఇంతకంటే మంచి సమయం దొరకదని లెక్కలు కడుతున్నారా? పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు ఆదేశాలతో ఇక చేరికలు లేనట్లేనని భావిస్తుండగా…కాంగ్రెస్ తో టచ్ లోకి ఎమ్మెల్యేలు వెళ్లారా? అంటే అవుననే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు.
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు డజన్ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఆదేశాలతో కారు దిగిన ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలడుతున్నా… ఈ అనర్హత వేటు నుంచి తప్పించేందుకు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలు పెట్టిందా? అనేది స్పష్టత లేదు. కానీ, కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఆశాకిరణంలా నిలిచేందుకు ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
బీఆర్ఎస్ లో కొనసాగితే రాజకీయ భవిష్యత్ ఉండదని ..కాంగ్రెస్ లో చేరేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ లో చేరాలంటే మంత్రి పదవులు కావాలని షరతులు విధించిన ఎమ్మెల్యేలు..మారిన రాజకీయ పరిణామాలతో మంత్రి పదవి అక్కర్లేదు..పార్టీలో చేర్చుకోండి అంటూ కబురు పంపుతున్నట్లు జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కాంగ్రెస్ లో ఇప్పుడు చేరితేనే ప్రాధాన్యత ఉంటుందని.. చేరికలు ఆ పార్టీకి ఇప్పుడు కీలకమని…అందుకే ఈ టైమ్ ను పక్కాగా వాడుకోవాలని ఫిక్స్ అయ్యారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అయితే, ఇదంతా ప్రచారమేనా.. బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేసేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఈ ప్రచారం ఏమైనా మొదలు పెట్టిందా? లేక డజన్ మంది ఎమ్మెల్యేలు నిజంగానే కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారా అని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది.