ప్రధానిగా పని చేసిన సమయంలో తెలంగాణ ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ అవకాశం కల్పించారు. ప్రధాని హోదాలో ఆయన అంగీకరించకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదు. మరి ఆయన చనిపోయిన తర్వాత బీఆర్ఎస్ ఆయనను గౌరవించిందా ? అంటే.. ఆలోచించాల్సిందే. కేసీఆర్ ఒక్క ప్రకటనతో సరి పెట్టారు. నివాళి అర్పించడానికి ఢిల్లీకి వెళ్లలేదు. కానీ ఓ టీమును వెళ్లారని ఆదేశించారని ప్రచారం చేశారు. కేటీఆర్ వెళ్లి నివాళులు అర్పించారు. కానీ కేసీఆర్ గౌరవించకపోవడం మాత్రం విమర్శలకు గురవుతోంది.
కనీసం అసెంబ్లీకి వచ్చి ఆయన సంతాపంగా కొన్ని మంచి మాటలు మాట్లాడినా బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇలా చేయడం వల్ల బీజేపీ ఆగ్రహించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మన్మోహన్ ను బీజేపీ కూడా గౌరవించింది. అసెంబ్లీ ఏర్పాటు చేసింది ప్రత్యేకంగా సంతాపం కోసం కాబట్టి .. అక్కడ ఇతర అంశాలు చర్చకు రావు. అలాంటప్పుడు ఆయన పెద్దరికాన్ని ఎవరూ అవహేళన చేయరు కూడా. అయినా కేసీఆర్ హాజరు కాకపోవడం విమర్శలకు కారణం అవుతోంది.
తెలంగాణ గుంజుకున్నామని బీఆర్ఎస్ నేతలు అంటారు. సోనియా దయతోనే వచ్చిందని సందర్భం వచ్చినప్పుడు చెబుతూంటారు. అయితే రికార్డుల ప్రకారం తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్. ఆయనకే క్రెడిట్ మొత్తం రావాలి. రికార్డుల కోసం అయినా ఆయనను బీఆర్ఎస్ సరైన రీతిలో గౌరవించినట్లయితే బాగుండేదన్న అభిప్రాయం సగటు తెలంగాణ వాదిలో వినిపిస్తోంది.