టీఆర్ఎస్ అధినేత , రెండో సారి తెలంగాణ ఎన్నికల్లో గెలిచి.. గాల్లోనే నడుస్తున్న అనుభూతి పొందుతున్న కేసీఆర్… తెర వెనుక కారణాలేమున్నాయో కానీ.. చంద్రబాబును టార్గెట్ చేశారు. ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేశారు. ఎప్పుడూ లేని విధంగా పరుష పదజాలాన్ని వాడారు. అది నచ్చిన వాళ్లు పొగిడారు. లేని వాళ్లు తెగిడారు. దానికి చంద్రబాబు.. ఆయనకు వచ్చిన భాషలో కౌంటర్ ఇచ్చారు. ఎవరి భాష వాళ్లది… అందులో ఏ సందేహం లేదు కానీ.. మధ్యలో ఇద్దరూ కలిసి…తమ పాత చరిత్రను తవ్వకోవడమే.. అందర్నీ ఆశ్చర్యానికి కాస్తంత వినోదానికి కారణం అవుతోంది.
చంద్రబాబు “టీడీపీ” గురించి తెలియనట్లు కేసీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారు..?
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితికి.. వన్ అండ్ ఓన్లీ లీడర్. ఆ పార్టీని ఆయనే స్థాపించారు. మధ్యలో.. అదే తెలంగాణ వాదంతో.. పార్టీలు పెట్టుకున్న ఆలె నరేంద్ర, విజయశాంతి లాంటి వాళ్లకు.. తన తర్వాత కుర్చీ చూపించి.. పార్టీలను కలిపేసుకుని.. తర్వాత వారిని నిర్వీర్యం చేసి దూరం చేసుకున్నా… ఆ బలం అంతా తనకే వచ్చింది. కానీ మరి అంతకు ముందు ఆయన ఎక్కడి లీడర్. తెలుగుదేశం పార్టీ లీడర్. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు.. ఎన్టీఆర్ పేరును తన కుమారుడికి పెట్టే ఘటన గురించినంత చర్చ ఇప్పుడు అవసరం లేదు కానీ.. ఇప్పుడు చంద్రబాబు టాపిక్ కాబట్టి… టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చేటప్పటి నుంచి చెప్పుకోవచ్చు. అప్పట్లో కేసీఆర్ ఎక్కడున్నారు. టీడీపీలో ఉన్నారు. ఆ టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి రావడానికి ఆయన కూడా.. ఓ మాస్టర్ ప్లానర్. ఆ విషయం.. అప్పటి.. ఇప్పటి టీడీపీ నేతలుక తెలుసు. అయినప్పటికీ.. ఆయన .. మామ నుంచి చంద్రబాబు పార్టీని లాగేసుకున్నారని ప్రకటించేశారు. దానికి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చే సమయంలో.. వైస్రాయ్ ఎపిసోడే కీలక ఘట్టం. ఎమ్మెల్యేలందర్నీ అక్కడే ఉంచారు మరి.. ఆ ఎమ్మెల్యేలను ఎవరు కోఆర్డినేట్ చేశారు… ఎవరూ బయటకు పోకుండా.. ఎవరు కాపాడారంటే.. కేసీఆరే… ! దాన్నే చంద్రబాబు చెప్పారు.
” మేనేజర్” దగ్గర అప్పుడు మేనేజ్ చేసుకోలేదా..?
కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు.. వరుసగా టిక్కెట్లు ఇచ్చి.. ఎన్టీఆర్ ప్రొత్సహించారు. పేరుకు టిక్కెట్లు ఇచ్చేది ఎన్టీఆరే ఆయినా పార్టీ వ్యవహారాలన్నీ చక్కబెట్టేది చంద్రబాబే కాబట్టి.. టిక్కెట్లు కూడా ఆయనే ఇచ్చారు. కేసీఆర్ చెప్పిన.. ” లాక్కున్న ఘటన ” జరగినప్పుడు కేసీఆర్ ముచ్చటగా మూడోసారి గెల్చి హ్యాట్రిక్ కొట్టిన సీనియర్ ఎమ్మెల్యే. అప్పుడు ఆయన ఆ సీనియార్టీ ప్రకారం.. 1995 వైశ్రాయ్ ఎపిసోడ్ లో తనకు టిక్కెట్టిచ్చి గెలిపించిన ‘లీడర్ ‘ ఎన్టీఆర్ వెనుక గట్టిగా నిలబడకుండా ‘మేనేజర్ ‘ చంద్రబాబు వెంట ఎందుకు ఉత్సాహంగా నడిచారో ఆయనే చెబితే విని తెల్సుకోవాలన్న ఆసక్తి లక్షలమందిలో ఉంది. ఇప్పుడాయన్ను తప్పుపట్టేవారూ ఆక్షేపించేవారూ ఎవరూ లేరు కాబట్టి కేసీఆర్ స్వేచ్ఛగా ఆరోజున తన అంతరంగంలో మెదిలిన భావాలూ వాటికి అనుగుణంగా ఎలా నడిచిందీ చెబితే ప్రజలకూ అర్థమవుతుంది.
మంత్రి పదవి కోసం పడిన తాపత్రయం ఎంత..?
ఇప్పుడంటే.. కేసీఆర్ అందరికీ టిక్కెట్లు ఇస్తారు. మంత్రి పదవుల కోసం… ప్రగతి భవన్ ముందు 70 మంది ఎమ్మెల్యేలతో పడిగాపులు పడేలా చేయగల స్థాయికి వచ్చారు. మరి అప్పుడు..? చంద్రబాబు పార్టీ లాక్కున్నారని.. చెప్పినప్పుడు.. ఆ లాక్కునే దాంట్లో సాయం చేసిన కేసీఆర్.. దానికి ప్రతిఫలంగా ఏం ఆశించారు. ఆయన మంత్రి పదవిని ఆశించారు. ఇక్కడ రత్నకుమార్ అనే సీనియర్ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో తన అనుభవాన్ని రాసుకున్నారు. దాన్ని చదువుదాం… !” చంద్రబాబు తొలివిడత జమానా ప్రారంభ దశలోకి తొంగి చూడాలి. అప్పట్లో ఎమ్మెల్యేలంతా మెరుగైన రాజకీయ జీవితం అంటే మంత్రి పదవి కోసం చంద్రబాబుకు ఇతోథికంగా సహకరించారు. వారిలో కేసీఆర్ కూడా ఒకరు. 1995లో చంద్రబాబు గద్దెనెక్కాక తమకు మంత్రిపదవి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసిన సీనియర్ ఎమ్మెల్యేల్లో కేసీఆర్ ఒకరు. రాజకీయంగా ఆయన మెదక్ జిల్లా దాటి పెద్దగా ప్రసిద్ధుడూ కాదప్పటికి! అసెంబ్లీలో ఆయన సీటు కూడా చివరి రెండు వరుసల్లో ఉండేది. అసెంబ్లీ కార్యకలాపాల్ని కవర్ చేసే విలేకరులు కూర్చునే ప్రెస్ గ్యాలరీ నుంచి చూసేవారికి ఆ రెండు వరసల్లో కూర్చునే ఎమ్మెల్యేలు కనిపించేవారు కాదు. సభాధ్యక్షుడు చదివే పేర్లను బట్టి ఎవరు మాట్లాడుతున్నారనే విషయం విలేకరులకు తెలిసేది. తాము విలేకరులకు కన్పించే అవకాశం లేదని , అందుకే తాము మాట్లాడినవి అసెంబ్లీ రికార్డుల్లో మాత్రమే ఉంటాయి కానీ పత్రికల్లో రావని ,ఈ కారణంగా ఎలాంటి గుర్తింపూ రావటంలేదన్న ఆవేదనను కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 1996లో ఓసారి అసెంబ్లీలాబీల్లో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఆ రోజున అసెంబ్లీ కవరేజీకి ఒక అగ్రశ్రేణి పత్రిక తరపున విధుల్లో ఉన్న నేను..కేసీఆర్ ఆవేదననూ రిపోర్ట్ చేశాను. ఆ తర్వాత జరిగిన విస్తరణలో మంత్రిపదవి దక్కించుకున్న కేసీఆర్ రవాణాశాఖ మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ఆటోమేటిగ్గా అసెంబ్లీలో మొదటి వరుసల్లోకి వచ్చేశారు. చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంపై అమితమైన సంతోషాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. ఇది తనకొచ్చిన గొప్ప అవకాశమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వ పటిమ , దార్శనికతపై ఎమ్మెల్యే గానూ మంత్రయిన తర్వాతా అసెంబ్లీలోనూ బయటా ఉపన్యాసాలు దంచేవారు. . ..” ఇదీ ఆ జర్నలిస్టు చెప్పిన అనుభవం.
ఇప్పుడెందుకు చంద్రులిద్దరూ ఇలా కీచులాడుకుంటున్నారు..?
రాజకీయంగా ఇద్దరిది ఇప్పుడు వేర్వేరు దారులు. ఇద్దరూ ఒకరికొకరు పైచేయి సాధించడానికి పోటీ పడుతున్నారు. కానీ కామన్‌గా చేసిన దాని గురించి విమర్శలు చేసుకోవడం ఎందుకు..? నిజానికి తెలుగుదేశం పార్టీని.. చంద్రబాబు అండ్ కో తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ప్రజలు ఆమోదించారు. అందుకే.. ఎన్టీఆర్ తర్వాత ప్రజల్లోకి వెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికీ.. టీడీపీ ఫ్యాన్స్ కూడా… చంద్రబాబు చేతుల్లోకి పార్టీ రావడం వల్లే ఇంత కాలం ఉందని నమ్ముతూంటారు. ఆనాడు పార్టీ కోసమే.. ఎన్టీఆర్‌ను ఇబ్బంది పెట్టారని నమ్ముతారు. అందుకే అందరూ చంద్రబాబు వెంట నడిచారు. ఇప్పుడేదో..చంద్రబాబు ఒక్కడే పార్టీని లాక్కున్నట్లుగా చెబితే.. ఆ కోపంతో వైసీపీకి ఓట్లు వేసేంత అమాయకులు టీడీపీ ఓటర్లు కాదు కదా.. !ఆ విషయం కేసీఆర్‌కు తెలియనిది కాదు., అయినా.. ఆ ఘటనను కేసీఆర్ ఎందుకు బయటకు తెస్తున్నారన్నదే ఆసక్తికరం..!
——–సుభాష్