తెలంగాణలో పార్టీకి పూర్వవైభవంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుత సమయంలో తెలంగాణలో టీడీపీ బలపడితే బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదమని భావిస్తోన్న గులాబీ బాస్..టీడీపీకి కౌంటర్ గా వ్యూహం రచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో టీడీపీకి ఇంకా బడుగు, బలహీన వర్గాల ఆదరణ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో టీడీపీ కార్యకలాపాలు తగ్గడంతో ఆ సామాజిక వర్గాలు బీఆర్ఎస్ వైపు కొంత మొగ్గు చూపాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకే బీఆర్ఎస్ ప్రతిష్టను కాపాడాయని పార్టీ అధినేత భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలనుకుంటున్న చంద్రబాబు నిర్ణయం బీఆర్ఎస్ ను కలవరపాటుకు గురి చేస్తోంది.
తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయితే బీసీ సామాజిక వర్గం అంతా సైకిల్ పార్టీ వైపు వెళ్తుంది. అదే జరిగితే బీఆర్ఎస్ మరింత పతనావస్థకు చేరుకుంటుంది అనేది కేసీఆర్ ఆందోళన. అందుకే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల బాధ్యతలను బీసీలకే ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. 33జిల్లాలో 25జిల్లాలో అధ్యక్ష బాధ్యతలను బీసీలకే అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే, అధికారంలో ఉన్నప్పుడు బీసీల పట్ల వివక్ష ప్రదర్శించిన బీఆర్ఎస్.. పవర్ పోయాక పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తే అది టీడీపీ చలువే అని క్యాడర్ గుర్తించకపోదా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.