జనసేన పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ దృక్పథం మారుతున్నట్లు కనిపిస్తోంది. అంటే అర్థం.. జగన్, పవన్ ఏకమయ్యారని కాదు. తెలుగుదేశం పార్టీ తన రాజకీయ విధానంలో బాగంగా… జగన్, పవన్ లను బీజేపీ నడిపిస్తోందని ఆరోపిస్తోంది. బీజేపీ పట్ల ప్రజల్లో కోపం ఉంది. ఆ కోపాన్ని.. బీజేపీతో కలిశారు అనడం ద్వారా.. పవన్ కల్యాణ్, జగన్మోహన్ రెడ్డిల మళ్లించి.. వారిని దెబ్బతీయవచ్చనేది టీడీపీ రాజకీయ వ్యూహం.
టీడీపీకి పవన్ విమర్శలు చంద్రబాబు ప్లానా…?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. పవన్ కల్యాణ్ పై గతంలో విమర్శల దాడి చేసినంతగా ఇప్పుడు చేయడం లేదు. ఇది కూడా ఓ రాజకీయ విధానం అనుకోవచ్చు. పవన్ కల్యాణ్ 2014లో చంద్రబాబుతో కలసి పని చేశారు. ఇటీవలి కాలం వరకూ… టీడీపీపై తీవ్ర వ్యతిరేక వైఖరి తీసుకోలేదు. నాలుగో ఆవిర్భావ దినోత్సవం నుంచే.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్‌పై ఊహించని రీతిలో విరుచుకుపడుతున్నారు. సహజంగానే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలక అంశం. ఎందుకంటే… అప్పటి వరకూ వైసీపీ దృష్టిలో పవన్ కల్యాణ్ … చంద్రబాబు మనిషి. చంద్రబాబు ఎజెంట్…చంద్రబాబే పవన్ కల్యాణ్ నడిపిస్తున్నారనే బావన ఉంది. అలాంటి ఒక్కసారిగా చంద్రబాబు, లోకేష్ పై ఆరోపణలు చేయడంతో.. వైసీపీ ఆశ్చర్యపోయింది. కాస్తంత సాఫ్ట్ గా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే వైసీపీకి ఓ అనుమానం ఉంది. అదేమిటంటే.. పవన్ కల్యాణ్ కూడా బరిలోకి దిగితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి.. తమకు నష్టం జరుగుతుందనేదే ఆ అనుమానం. దీనితో పాటు.. అసలు పవన్ కల్యాణ్.. చంద్రబాబు ఎత్తుగడలో భాగంగానే… టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారన్న అనుమానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి.
పవన్ ఫ్యాన్స్ ఓట్లను ఆకట్టుకునేలా వైసీపీ వ్యూహం..!
ఇప్పటికీ ఆ అనుమానాలు వైసీపీలో ఉండొచ్చు.. కానీ పవన్ కల్యాణ్ టీడీపీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్ ను టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ రాజకీయాల వల్ల పవన్ కల్యాణ్ అభిమానుల్లో తెలుగుదేశం పార్టీ వ్యతిరేకత పెరుగుతుంది. పవన్ కల్యాణ్ అభిమానుల్లో చంద్రబాబు, టీడీపీ పై వ్యతిరేకతను.. తమకు ఎలాగైనా అనుకూలంగా ఉపయోగించుకోవాలన్నది వైసీపీ ఆలోచన. ఎందుకంటే.. రేపు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి .. టీడీపీ వర్సెస్ వైసీపీగా ఎన్నికల పోరు ఉంటుంది. టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్లు ఎన్నికల పోరు ఉంటే.. పపవన్ అభిమానులు కచ్చితంగా జనసేనకే ఓటు వేస్తారు. లేదంటే.. టీడీపీ వర్సెస్ వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లు పోరు ఉన్నా… జనసేనకు ఓటు వేస్తారు. ఇలా లేని పరిస్థితుల్లో… జనసేన ప్రభావం లేని పార్టీగా ఉంటే… టీడీపీ, వైసీపీ మధ్య పోరాటం ఉంటుంది. ఆ సమయంలో చంద్రబాబునాయుడిని తీవ్రంగా విమర్శించిన తమ నాయకుడి లక్ష్యాలకు అనుగుణంగా.. పవన్ అభిమానులంతా.. వైసీపీకి ఓటు వేయకపోతారా.. అన్నది ఆ పార్టీ ఆలోచన.
కాపుల్లో టీడీపీకి ఉన్న ఎడ్జ్ తన వైపు తిప్పుకోవడం..!
జనసేనకు ఓటు వేయడమంటే.. టీడీపీకి ఓటు వేసినట్లే అన్న ప్రచారాన్ని తీసుకురావొచ్చు. జనసేనకు ఓటు వేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి చంద్రబాబు గెలుస్తారన్న ప్రచారాన్ని వైసీపీ తీసుకురావొచ్చు. ఇలా చేయడం వల్ల జనసేన అభిమానులు.. అంతిమంగా వైసీపీకి ఓటు వేయకపోతారా అన్న ఆలోచనతో ఆ పార్టీ నేతలు పవన్ కల్యాణ్ పై కాస్తంత దృక్ఫథాన్ని మార్చుకుని ఉండవచ్చు.
జనసేనకు ఎంత శాతం ఓటింగ్ వస్తుందో చెప్పలేము కానీ.. పవన్ కు మాత్రం పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. పవన్ అభిమానుల్లో ఎక్కువ మంది కాపు యువతే. ఇతరులు అభిమానులుగా లేరని చెప్పలేం కానీ.. కాపు యువతే.. పవన్ కల్యాణ్ కు గొప్ప మద్దతుదారులు. గత ఎన్నికల్లో కాపు ఓటింగ్ మొత్తం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరిగింది. పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడం, కాపు రిజర్వేషన్ల హామీలు ఇందుకు ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు పరిస్థితి కొంత మంది.. పవన్ కల్యాణ్ టీడీపీకి వ్యతిరేకమవడం, ముద్రగడ ఉద్యమం.. కాపులను టీడీపీకి కొంచెం దూరం చేశాయి. కానీ ఇప్పటికీ.. కాపుల్లో టీడీపీకే ఎడ్జ్ ఉంది. ఎందుకంటే.. జనసేన ఇంకా స్థిరపడలేదు. వైసీపీకి ఓటు వేయడానికి సిద్ధపడలేదు. కాబట్టి.. ఇంకా ఓటు షిఫ్ట్ కావడం లేదు. రేపు వపన్ కల్యాణ్ రేసులో లేరని తెలిస్తే.. వీరంతా తమకే తప్పకుండా ఓటు వేస్తారనేది వైసీపీ అంచనా.
చంద్రబాబుపై కోపంతో పవన్ ఫ్యాన్స్ వైసీపీకి ఓటేస్తారా..?
అయితే పవన్ కల్యాణ్ కు ఒక్క కాపు ఓటింగ్ మాత్రమే ఉంటుందనుకోవడం పొరపాటు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు.. ఒక్క కాపు సామాజికవర్గమే.. కాదు.. ఇతరులు కూడా ఓట్లు వేశారు. అలాగే ఇప్పుడు పవన్ వెంట నడుస్తున్నవారిలో… చంద్రబాబుపై ఆగ్రహంతో..తమ వెనుక రాకపోతారా అన్న ఆలోచనతో.. వైసీపీ.. పవన్ కల్యాణ్ విషయంలో తన విధానాన్ని మార్చుకుందని భావించవచ్చు.