పదవులు రాలేదని అసంతృప్తికి గురి కావడం వేరు… నిర్ణయాల పట్ల అసంతృప్తికి గురి కావడం వేరు రాజకీయ పార్టీల్లో పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాలపై అసహనం పెద్దగా కనిపించదు. వైసీపీలో అసలు కనిపించదు. ఎంతటి దారుణమైన నిర్ణయం తీసుకున్నా అందరూ సమర్థిస్తారు. చివరికి మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించలేక సమర్థించారు. ఇష్టం లేని వాళ్లు ఊరుకున్నారు. కానీ అలాంటి నిర్ణయాలు రాను రాను పెరిగిపోతూండటంతో వారిలోనూ అసహనం పెరుగుతోంది. బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై వైసీపీలోనే అసంతృప్తి వ్యక్తమయింది. సోషల్ మీడియాలో ఆ పార్టీని హార్డ్ కోర్గా అభిమానించేవారే తుగ్లక్ నిర్ణయంగా తేల్చేశారు. పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్లో నిరాశ కనిపించింది. ఎందుకిలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే నిర్వేదమూ కనిపించింది. అధికారం పోతే పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఎక్కువ మందిలో కనిపించింది. ఈ సారి విషయం ఏమిటంటే చాలా మంది తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేశారు.
ఏ పార్టీ అయినా ప్రభుత్వం అయినా పూర్తి స్థాయిలో ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. మొదట లీకుల ద్వారా మీడియాలో ప్రచారం చేసి అయినా స్పందన ఎలా ఉంటుందో తెలుసుకుని ముందుకెళ్తుంది. కానీ ఈ ప్రభుత్వం ప్రజలు తమకు అధికారం ఇచ్చారు కాబట్టి ఏదైనా చేయవచ్చని ముందుకెళ్తోంది. ఇది అందర్నీ నిరాశకు గురి చేస్తోంది. పైసా ప్రయోజనం లేని నిర్ణయాల వల్ల మొదటికే మోసం వస్తుందని గందరగోళపడుతున్నారు. ఇలాంటి అభిప్రాయాలను తెలుసుకునే తీరిక వైసీపీ నేతలకు లేకుండా పోయింది. రేపు పార్టీ కోసం పని చేయాల్సింది వాళ్లేనని ఇప్పటికీ వైసీపీ హైకమాండ్ గుర్తించలేకపోతోంది.