ఐదేళ్లపాటు అధికార మైకం కమ్మేసింది.. ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే అదే ప్రజలను కలిసేందుకు కూడా ఇష్టపడలేదు.. కనీసం వారిని చూసేందుకు కూడా ఆసక్తి చూపలేదు.. పరదాల మాటున ప్రయాణం.. ప్రజల జీవితాలను స్వయంగా తెలుసుకోవాలన్న కనీస ఆలోచన లేని నియంత విధానం..ఇంకేముంది.. ప్రజలు తమ ఆయుధంతో అధికార మైకాన్ని తొలగించాక , వైసీపీ అధినేత జగన్ కు తత్త్వం బోధపడుతున్నట్లు కనిపిస్తోంది.
అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కాదు..కనీసం నేతలను కూడా కలిసేందుకు జగన్ ఆసక్తి చూపలేదు. దాంతో జగన్ వైఖరిపై విరక్తి చెంది పలువురు సీనియర్ నేతలు ఆత్మగౌరవాన్ని చంపుకోలేక పార్టీని వీడారు. గతంలో వైసీపీకి కట్టర్ సేవకులుగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా గుడ్ బై చెప్పింది. అంతా నేనే.. సర్వం నేనే అనుకున్న జగన్ కు ప్రజాస్వామ్యంలో నియంతలా వ్యవహరిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ప్రజలంతా మూకుమ్మడిగా రుచి చూపించారు.
Also Read : వైసీపీకి షాక్ ఇచ్చేలా కేతిరెడ్డి వ్యాఖ్యలు!
అందుకే బెంగళూరు పర్యటన ముగించుకొని వచ్చాక అధికార నివాసంలో ప్రజా దర్బార్ తరహాలో ఓ కార్యక్రమం నిర్వహించారు. జగన్ అందుబాటులో ఉన్నారని తెలిసి తాడేపల్లిలోని ఆయన నివాసానికి పలువురు వెళ్ళారు. వారందరితో జగన్ మమేకం అయ్యారు. ఓ పిల్లాడిని దగ్గరికి తీసుకొని తన సహజశైలిలో ఆప్యాయంగా ముద్దులు పెట్టారు. వచ్చిన వారికి కాదనకుండా సెల్ఫీలు ఇచ్చారు. కొంతమంది వినతులు స్వీకరించారు.
జగన్ చేసిన ఈ కార్యక్రమం బాగానే ఉన్నా.. ఇది ఐదేళ్లలో కొనసాగించి ఉంటే బాగుండేది అని వైసీపీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఇంటి గుమ్మ్మం ముందుకు కూడా ఎవరిని రానివ్వలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయాక ప్రజలకు నేనున్నా.. అందుబాటులో ఉంటా .. అంటే ఎవరు నమ్ముతారు..?ఒక్క అవకాశం అని నమ్మిన ప్రజలు జగన్ కు అధికారాన్ని కట్టబెడితే ప్రజలకు చుక్కలు చూపించారు. ఆ నమ్మకాన్ని కోల్పోయారని సార్వత్రిక ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయి. ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని జగన్ మళ్లీ పొందటం సవాలే.