జగన్ రెడ్డి తల్లి , వైసీపీ మాజీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ బర్త్ డే నేడు. సోషల్ మీడియా వేదికగా వైఎస్ షర్మిల తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపే జగన్ మాత్రం ఈ ఏడాది ఇప్పటి వరకు ఎలాంటి ట్వీట్ చేయలేదు. దీంతో జగన్ – విజయమ్మకు మధ్య పూడ్చలేని గ్యాప్ పెరిగినట్లుగా తెలుస్తోంది.
వైఎస్ షర్మిల రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి తల్లి విజయమ్మతో జగన్ కు గ్యాప్ ఏర్పడింది. ఆ తర్వాత అది మరింత పెరుగుతూ పోయింది. వైఎస్ వివేకా హత్య విషయంలో, గత ఏడాది ఎన్నికల సమయంలో జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన షర్మిలకు విజయమ్మ మద్దతు ఇవ్వడం జగన్ తట్టుకోలేకపోయారు. రాజకీయంగా విబేధించారు అనే కారణంగా తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై ఏకంగా కోర్టుకు ఎక్కారు.
షర్మిలకు తనపై ఏమాత్రం ప్రేమ లేదని, అందుకే చెల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసుకుంటున్నానని పిటిషన్ లో జగన్ పేర్కొన్నారు.సరస్వతి పవర్ కంపెనీలో తనకు , తన భార్య భారతిరెడ్డికి ఉన్న వాటాలను , సరస్వతిలోనే తమకు చెందిన క్లాసికల్ రియాల్టీ అనే మరో కంపెనీకి ఉన్న వాటాల్లో ఉన్న అధిక భాగాన్ని తల్లి విజయమ్మ పేరుతో సరస్వతి కంపెనీ బోర్డు అక్రమంగా బదలాయించింది అంటూ భారతి, క్లాసికల్ రియాల్టీలతో కలిపి జగన్ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అది తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఈ వ్యవహారంపై ఇంకా వివాదం నడుస్తోంది. అన్నా, చెల్లెళ్ల మధ్య ఆస్తుల విషయంపై తలెత్తిన వివాదంతో విజయమ్మ కూడా కంటతడి పెట్టుకున్నారు. ఓ సుదీర్ఘ లేఖ కూడా విడుదల చేశారు. అప్పటి నుంచి ఆమె షర్మిలతోనే ఉంటున్నారు. కొంతకాలంగా జగన్ తో సంభాషణ కూడా కట్ అయిందని ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే విజయమ్మ బర్త్ డే రోజున జగన్ కనీసం ట్వీట్ చేయకపోవడంతో ఈ ప్రచారానికి బలం చేకూర్చినట్లు అయింది. అయితే, ఎక్స్ వేదికగా జగన్ ట్వీట్ చేయకపోయినా.. కనీసం ఫోన్ చేసి అయినా విషెస్ చెప్పారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.