హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కీలక నేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సహకరించొద్దంటూ జగన్ సింగపూర్ ప్రభుత్వానికి లేఖలు రాశారని ఆరోపించారు. ఆ ప్రభుత్వం ఈ లేఖలు చూసి నవ్వుకుని వాటిని చెత్తబుట్టలో వేసిందని లోకేష్ చెప్పారు. నిన్న హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ లోకేష్ ఈ ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా దానిని అడ్డుకోవటమే జగన్ పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనేతప్ప ఆ ప్రాంతాలు ఆభివృద్ధిలోకి వస్తాయని జగన్ ఆలోచించటంలేదని అన్నారు. కనీసం రాజధాని కూడా లేని దుస్థితిలో ఏపీ ఏర్పడిందని చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రం నిలదొక్కుకోవటానికి, రాజధాని కట్టుకోవటానికి అందరూ తలో చెయ్యి వేయాలని, జగన్ మాత్రం దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
జగన్పై ఇంత సంచలన ఆరోపణలు చేసిన లోకేష్ దానికి ఆధారాలు బయటపెట్టకపోవటంతో ఆయన ఆరోపణల విశ్వసనీయతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలుకూడా ఇవాళ లోకేష్ ఆరోపణలను ఖండించలేదు. ఈ విషయంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.