అన్నీ బాగుంటే ఈపాటికి.. ‘జనగణమన’ కొత్త షెడ్యూల్ మొదలైపోయేది. విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్… ముంబైలో ‘జనగణమన’ షూటింగ్ లో బిజీగా ఉండేవారు. కానీ.. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘లైగర్’ డిజాస్టర్ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ ‘జనగణమన’పై పడింది. ఈ సినిమా ఇక సెట్స్‌పై వెళ్లే అవకాశం దాదాపుగా లేనట్టే. అయితే.. ‘లైగర్’పై నమ్మకంతో ‘జనగణమన’ ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. 12 రోజుల పాటు విజయ్ దేవరకొండపై యాక్షన్ సీన్లనీ, హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్రడక్షన్ సీన్లని తెరకెక్కించారు. అందుకోసం దాదాపుగా 5 కోట్ల వరకూ ఖర్చయినట్టు తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు ఆ సీన్లన్నీ చెత్త బుట్టలో వేసేయాల్సిందేనా..? అనే ప్రశ్న తలెత్తక మానదు.
కాకపోతే.. పూరి ఇక్కడ తెలివిగా చేసిందేంటంటే… విజయ్ యాక్షన్ సీన్, పూజా హెగ్డే ఇంట్రడక్షన్ వేర్వేరుగా షూట్ చేశాడు. విజయ్ మరో సినిమా చేసుకుంటే.. ఈ యాక్షన్ సీన్లను యాడ్ చేసుకోవొచ్చు. పూజాతో ఏ సినిమా చేసినా.. ఆ ఇంట్రడక్షన్ సీన్లని వాడుకోవొచ్చు. ఏ కమర్షియల్ సినిమాలో అయినా హీరో ఎంట్రీ ఫైట్ సీన్ తో అయితే ఒకే టెంపోలో సాగుతుంది. హీరోయిన్ ని కూడా బ్యూటీఫుల్ మాంటేజ్లలో చూపిస్తుంటారు. ‘జనగణమన’లో డైలాగులేం లేకుండా.. ఓ ఫైట్, హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్లు తీశాడు పూరి. తనెప్పుడైనా విజయ్‌తో గానీ, పూజా తో గానీ సినిమా చేస్తే ఆయా సన్నివేశాలు పనికొస్తాయట. కాబట్టి.. వేస్టేజీ ఏమీ లేదన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్.