తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్రానికి లేని ఇబ్బందిని ఎందుకు భరిస్తోంది ? ధాన్యం .. వడ్లు కొనుగోలుపై ఎవరూ చేయని ఆందోళన ఎందుకు చేస్తుంది ? పక్క రాష్ట్రం ఏపీకి కూడా లేని సమస్య తెలంగాణకు ఎందుకొచ్చింది ? ఇది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ఈ సమస్యను తెలంగాణ ప్రభుత్వమే కొని తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కేంద్రంతో తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకుంది. తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఎఫ్‌సీఐ తరఫున హైదరాబాద్ రీజినల్ జనరల్ మేనేజర్ మధ్య కుదిరిన ఒప్పందంలో కీలకమైన అంశాలున్నాయి.
భవిష్యత్తులో ఎఫ్‌సీఐకి తెలంగాణ పారా బాయిల్డ్ రైస్ సరఫరా చేయం.. రాష్ట్రంలో రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి కోసం పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకుంటాం.. బియ్యానికి కొన్ని రకాల పోషకాలను చేర్చి ఫోర్టిఫైడ్ రైస్‌గా మార్చుకుంటాం.. ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తికి సరిపయేలా మిల్లుల సామర్థ్యాన్ని పెంచుతాం వంటి వాటిని ప్రభుత్వం చెప్పింది. 2020-21 సంవత్సరంలో ధాన్య సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాలకు, క్షేత్రస్థాయిలో ఫిజికల్ వెరిఫికేషన్ సందర్భంగా కొన్ని తేడాలు చోటుచేసుకున్నాయి. దీన్నే బీజేపీ నేతలు పెద్ద స్కాంగా చెబుతున్నారు.
2021 అక్టోబరు 10 నుంచే ధాన్య సేకరణకు తప్పనిసరిగా పాటించాల్సిన ప్రమాణాలను అమలుచేస్తామని తెలంగాణ స్పష్టమైన రాతపూర్వక ఒప్పందం చేసుకుంది. ఒప్పందంపైనే కేంద్రం పట్టు బడుతోంది. నిబంధనలను అంగీకరించినందున ఇప్పుడు వడ్లనే కొనాలని, పారాబాయిల్డ్ రైస్ కూడా కొనాలని ఒత్తిడి తేవడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పు పడుతోంది. ముడి బియ్యాన్ని ఎంత మోతాదులో ఇచ్చినా తీసుకుంటామని బాయిల్డ్ రైస్ మాత్రం ఒప్పందంలో తెలంగాణ పేర్కొన్నట్లుగానే నడుచుకోవాలని అంటున్నారు. కానీ ఒప్పందాన్ని మించి కేంద్రం వ్యవహరించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది.. ఇక్కడే సమస్య వచ్చింది.