మల్లన్నసాగర్ ప్రాజెక్టు వ్యవహారంలో మంత్రి హరీష్ రావు ప్రతిపక్ష పార్టీలతో ఒంటరిపోరాటం చేస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి కెసిఆర్, ఇతర మంత్రులు, పార్టీ నేతలు, ఎవరూ ఆయనకి అండగా నిలబడేందుకు ముందుకు రాకపోవడం చాలా విచిత్రంగానే ఉంది. ఇది ఊహాగానాలకి తావిస్తోంది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కెసిఆర్ హరీష్ రావుని బలిపశువు చేశారంటూ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కెసిఆర్ తన కుమారుడు కెటిఆర్ ని పార్టీలో, ప్రభుత్వంలో తిరుగులేని శక్తిగా నిలిపేందుకే, కెటిఆర్ కి సవాలుగా కనిపిస్తున్న హరీష్ రావుని ఒంటరిగా వదిలేసి బలిపశువుని చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అవి నిజమని, అబద్దమని చెప్పలేము. కేవలం ఊహాగానాలు మాత్రమే కనుక భవిష్య పరిణామాలని బట్టే అంచనా వేయవలసి ఉంటుంది.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు వ్యవహారంలో హరీష్ రావు ఒంటరిపోరాటం చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు కూడా ఆయన ఈ సమస్యని, ప్రతిపక్ష పార్టీలని చాలా చక్కగానే హ్యాండిల్ చేస్తున్నట్లు కనబడుతోంది. ఈ ప్రాజెక్టు క్రింద ముంపుకి గురయ్యే 8 గ్రామాల ప్రజలతో ఆయన ముఖాముఖి మాట్లాడుతూ, వారి సందేహాలన్నీ స్వయంగా నివృతి చేస్తూ వారిని భూసేకరణకి ఒప్పిస్తున్నారు. అందుకు అంగీకరించిన రైతులని ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతున్నాయని గ్రహించి, వారు ప్రతిపక్షాల ఒత్తిడికి లొంగి మళ్ళీ మనసు మార్చుకోకముందే, గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్ శాఖ కౌంటర్లు ఏర్పాటు చేయించి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియని చకాచకా పూర్తి చేసేస్తున్నారు. అదే సమయంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు దగ్గరకి బయలుదేరిన ప్రతిపక్షాలని అక్కడికి రాకుండా ముందే పోలీసులతో అడ్డుకొని భూసేకరణ ప్రక్రియకి వారి వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తపడుతున్నారు.
నిర్వాసితులపై పోలీసుల లాఠీ చార్జ్, ప్రతిపక్ష పార్టీల నేతలని, ప్రొఫెసర్ కోదండరాం తదితరులని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం వలన తెరాస ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొని దాని వలన చెడ్డపేరు వస్తోందని గ్రహించి, ఆ ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన ఇతర ప్రాజెక్టుల వివరాలు గణాంకాలతో సహా నిన్న మీడియా ద్వారా ప్రజలకి వివరించారు.
ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరుతో అంచనాలు పెంచేసి తెరాస నేతలు డబ్బులు దండుకొంటున్నారనే ప్రతిపక్ష పార్టీల విమర్శలకి ఆయన చాలా దీటుగా జవాబు చెప్పారు. తమ ప్రభుత్వం అన్ని సాగునీటి ప్రాజెక్టులపై నిపుణులతో, ఇంజనీర్లతో చర్చించి, దానిలో సాధకబాధకాలని, సమస్యలని అన్నిటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాతే ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ చేయడం ద్వారానే వాటి క్రింద ముంపు ప్రాంతాన్ని తగ్గించగలిగామని గణాంకాలతో సహా వివరించారు.
అలాగే ఆంధ్రప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో అటువంటి ప్రాజెక్టుల కోసం అక్కడి ప్రభుత్వాలు ఎంతెంత భూములు సేకరిస్తున్నాయో గణాంకాలతో సహా వివరించి, అక్కడ తప్పు పట్టని ప్రతిపక్ష నేతలు తెలంగాణాలో కొద్దిపాటి భూములని సేకరించి, రాష్ట్రమంతా నీళ్ళు పారిస్తామని చెపుతుంటే ఎందుకు అభ్యంతరాలు చెపుతున్నారని గట్టిగానే నిలదీశారు.
ఈవిధంగా హరీష్ రావు ఒంటిచేత్తోనే అన్ని పనులు చక్కబెట్టి తన సామర్ధ్యం నిరూపించుకొంటున్నారు. ఆ ప్రాజెక్టులో మంచిచెడులు… ..దానికోసం ఆయన అనుసరిస్తున్న మార్గాలలో మంచి చెడులని పక్కనబెట్టి చూస్తే ఆయన చాలా సమర్ధంగానే వ్యవహరిస్తున్నారని అర్ధమవుతుంది. ఒకవేళ ఆయన ఈ పరీక్షలో విజయం సాధించితే, కెసిఆర్ మళ్ళీ ఆయన గురించి గట్టిగా ఆలోచించక తప్పదేమో?