తెలంగాణ మంత్రి మల్లారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. న్యాక్ గ్రేడ్ ఏ గుర్తింపు కోసం ఆయనకు సంబంధిచిన కాలేజీల ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించారని తేలింది. ఈ తప్పు చేసినందుకు కాలేజీపై ఐదేళ్ల పాటు బ్యాన్ వేశారు. మంత్రిగా ఉంటూ తప్పుడు పనులు చేసినందుకు.. ఆయన రాజీనామా చేయాలని విపక్ష నేతలు డిమాండ్లు ప్రారంభించారు. పదో తరగతి వరకు మాత్రమే చదివిన చామకూర మల్లారెడ్డి తెలంగాణలో విద్యావేత్తగా ఎదిగారు. ఇంజినీరింగ్ కాలేజీలు.. మెడికల్ కాలేజీలు పెట్టారు. అన్నీ ఆయన పక్కాగా సర్టిఫికెట్లు సమర్పించి ఇంత కాలం నడుపుతున్నారని ఎవరూ అనుకోరు.
ఆ మాటకొస్తే ఇంజీనింగ్, మెడికల్ కాలేజీలన్నీ అవకతవకలకు పాల్పడుతూంటాయి. ఏఐసీటీఈ, న్యాక్ సహా వివిధ రెగ్యూలేటరీ సంస్థల్ని కాలేజీ యాజమన్యాలు మేనేజ్ చేసుకుంటూ ఉంటాయి. తనిఖీ బృందాలను సంతృప్తి పరిచి కావాల్సిన అనుమతులు పొందుతూంటాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మల్లారెడ్డి ఎన్నో కాలేజీలు పెట్టారు. అలాటంప్పుడు ఎన్నో సార్లు … రెగ్యూలేటరీ సంస్థల్ని మేనేజ్ చేసి ఉంటారు. ఏ పదవులు లేనప్పుడు ఆయన మేనేజ్ చేయగలిగినప్పుడు .. మంత్రిగా ఉండి ఇప్పుడు ఎందుకు ఆ పని చేయలేకపోయారన్నదే… చాలా మందికి కలుగుతున్న సందేహం.
రాజకీయాల్లో లేకపోతే ఉండే అడ్వాంటేజ్ వేరు. వ్యాపారవేత్తగా దేన్నైనా ఏదో విధంగా చక్క బెట్టుకోవచ్చు. కానీ రాజకీయాల్లోకి వస్తే మాత్రం… వ్యాపారాలపైనా ఆ ప్రభావం పడుతుంది. అధికార పార్టీలో ఉన్నప్పటికీ.. అది ప్లస్ అయ్యేదాని కన్నా మైనస్ అయ్యేదే ఎక్కువ ఉంటుంది. ఆయనను తొక్కేయాలనుకున్న వారు.. మరింత అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. ఇప్పుడు మల్లారెడ్డి అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్న చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్లో ప్రస్తుతం ఆయన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన కాలేజీల ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం బయటకు రావడం… సంచలనం సృష్టించకుండా ఎలా ఉంటుంది.