హైదరాబాద్: 2014 నుంచి 2026 వరకు భారతదేశాన్ని ఒక వ్యక్తి పరిపాలిస్తాడని, అతనిని ప్రజలు మొదట ద్వేషిస్తారని, అయితే అతను తర్వాత దేశ దశ, దిశను మార్చేయటంతో విపరీతంగా ప్రేమిస్తారని ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్టర్ డామస్ 450 సంవత్సరాల క్రితం చెప్పింది నరేంద్ర మోడిగురించేనంటూ ఇప్పుడు ‘వాట్సప్’లో ఒక మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ఆ మెసేజ్‌లో వివరాల ప్రకారం – భారత్‌లో మోడి శకాన్ని నోస్టర్ డామస్ 1555లోనే ఊహించి చెప్పారు. ఫ్రాన్స్ దేశానికి చెందిన నోస్టర్ డామస్(1503-1566) పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిలాగా ఒక కాలజ్ఞాని. ఆయన ఫ్రెంచ్ భాషలో రాసిన కాలజ్ఞానాన్ని మహారాష్ట్రకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు డాక్టర్ రామచంద్ర జోషి మరాఠీ భాషలోకి అనువదించారు. మధ్యవయస్కుడైన ఒక సూపర్ పవర్ నాయకుడు భారత్‌లోనేకాక యావత్ ప్రపంచంలో ఒక స్వర్ణయుగాన్ని తీసుకొస్తారు. ఆయన సనాతన ధర్మాన్ని పునరుద్ధరిస్తారు, దేశంలోని అనేక దుష్టశక్తులపై విజయం సాధించి దేశాన్ని తనకాళ్ళపై తాను నిలబడేటట్లు చేయటమేకాక భారత్‌ను అత్యుత్తమమైన దేశంగా మారుస్తారు. ఆయన పాలనలో భారత్ అంతర్జాతీయంగా అగ్రస్థానంలోకి చేరటమేకాక ఎన్నోదేశాలు భారత్ అండలో తలదాచుకుంటాయి.
నరేంద్రమోడికి బుద్ధుడు, మహావీరుడుతో పోలికలున్నాయనికూడా ఆ వాట్సప్ మెసేజ్‌లో పేర్కొన్నారు. బుద్ధుడు పెళ్ళి చేసుకున్నాడు, భార్యను వదిలేసి సత్యంకోసం వెతుకుతూ వెళ్ళిపోయాడు. భార్య ఒంటరిగానే ఉండిపోయింది. ఆమె పేరు యశోధర. మహావీరుడు కూడా పెళ్ళి చేసుకున్నాడు, కానీ భార్యను వదిలేసి సర్వసంగపరిత్యాగిగా మారాడు. ఆయన భార్య ఒంటరిగానే జీవించింది. ఆమె పేరు యశోద. నరేంద్ర మోడికూడా పెళ్ళిచేసుకున్నారు. కానీ భార్యను వదిలేసి దేశసేవలో మునిగిపోయారు. ఆయన భార్య ఒంటరిగానే జీవిస్తోంది. ఆమె పేరు యశోదాబెన్. యశోధర-యశోద-యశోదాబెన్. ఇది యాధృచ్ఛికమా, చరిత్ర పునరావృతమవుతోందా?