ఓట్లు చీలనివ్వనని చాలెంజ్‌లు చేసిన పవన్ కల్యాణ్.. మోడీతో భేటీ తర్వాత సైలెంట్ అయిపోయారని సీపీఐ నేత నారాయణ చెబుతున్నారు. అంతకు ముందు ఆయన ఆవేశం ఇప్పుడు ఏమయిందని అడుగుతున్నారు. మోదీతో పవన్ భేటీ తర్వాత జనసేన లో మార్పు వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు అదేపనిగా జనసేన మాతోనే ఉంటందని చెబుతున్నారు. ఈ అంశంపై పవన్ కల్యాణ్ తర్వాత ఎప్పుడూ మాట్లాడలేదు కానీ.. నాదెండ్ల మనోహర్ మాత్రం.. వైసీపీ ముక్త ఏపీ కోసం పని చేస్తున్నామని .. అందరం కలసి పోరాడాలని పిలుపునిచ్చింది.
పవన్ కల్యాణ్ ఆలోచనలు స్థిరంగా లేకపోవడం.. క్యాడర్‌కు ఒకే సందేశం వెళ్లకపోవడ ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్ని సైతం బాగా ఇబ్బంది పెడుతోంది. వైసీపీ నేతల సంగతి తేలుస్తానంటూ ఓ సందర్భంలో చెప్పూ చూపించిన పవన్.. వెంటనే చంద్రబాబుతో భేటీ కావడంతో ద్వారా జగన్‌కు డేంజర్ బెల్స్ మోగించారు. కానీ మోడీతో జరిగిన భేటీ తర్వాత మాత్రం ఆయనతో మార్పు వచ్చినట్లుాగ ప్రవర్తిస్తున్నారు. ఒంటరిగా పోటీ చేస్తారా.. బీజేపీతో పోటీ చేస్తారా అన్నదానిపై మాత్రం ఎలాంటి సంకేతాలు ఇవ్వలేకపోతున్నారు. టీడీపీతో కలిస్తే గెలుపు ఖాయమని వస్తున్న రిపోర్టులతో కూడా ఆయన ధైర్యంగా అడుగు వేయలేకపోతున్నారు.
గత ఎన్నికల్లో సీపీఐతో కలిసే జనసేన పోటీ చేసింది. అందుకే సీపీఐ నేత నారాయణ… వచ్చే ఎన్నికల్లోనూ పొత్తు ఉండాలనుకుంటున్నారు. వైసీపీని ఓడించాలంటే టీడీపీ, జనసేన, వామపక్షాలు కలవాలంటున్నారు. అయితే జనసేన కు మాత్రం ఈ విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు టీడీపీ వైపు వెళ్లకుండా.. మోదీ స్థాయిలో ఏదైనా ప్రయత్నం జరిగిందో లేదో కానీ.. అదే జరిగితే.. వైసీపీని మరోసారి గెలిపించడమేనన్న అభిప్రాయం జనసేనలో కూడా వినిపిస్తోంది.