కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ మోడల్ ను అమలు చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటన చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఆరు నెలలే అవుతున్నా అప్పుడే తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారా..? అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఇంకా అమలు చేయకపోవడంపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. రెండు లక్షల రైతు రుణమాఫీ కోసం సర్కార్ భూములను అమ్మాల్సిన పరిస్థితి నెలకొంది. ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోయినా తెలంగాణ మోడల్ అంటూ రాహుల్ ప్రకటన పట్ల రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
రాహుల్ ప్రకటన రాజకీయంగా కాంగ్రెస్ కు ఎలాంటి మేలు చేస్తుందో కానీ, బీఆర్ఎస్ కు కూడా మేలు చేసే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వమేర్పడి ఆరు నెలలే అవుతున్నా దేశానికి దిక్సూచిగా రాష్ట్రం నిలుస్తుందంటే అందుకు కారణం బీఆర్ఎస్సేనని ఆ పార్టీ ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. తమ దూరదృష్టితో కూడిన పాలన అనుభవానికి రాహుల్ ప్రకటన నిదర్శనమని చెప్పే ఛాన్స్ ఉంది. తాము చేసిన అభివృద్ధిని విధ్వంసం చేసి తెలంగాణ మోడల్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారని కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎదురుదాడి చేయనుంది.
మరోవైపు..రాహుల్ ప్రకటన విమర్శలకూ తావిస్తోంది. ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడమే తెలంగాణ మోడల్ అంటూ బీజేపీ నిలదీస్తోంది. అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవెర్చారని రాహుల్ గాంధీ చెప్పకనే చెప్తున్నారని కమలనాథులు కాంగ్రెస్ పై కత్తులు నూరుతున్నారు.