తెలంగాణ ప్రభుత్వంపై ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత పెరిగిందని చూపించడానికి ఎంత భారీ స్థాయిలో ప్రయత్నాలు జరిగాయో కాంగ్రెస్‌కు .. సీఎం రేవంత్ రెడ్డికి మెల్లగా క్లారిటీ వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఆయన తాజాగా కొడంగల్‌లో పెడుతున్నది ఫార్మా పరిశ్రమ అన్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రయత్నించారు. అక్కడ సాగులోలేని భూముల్నేతీసుకుంటున్నామని అది కూడా ఫార్మా పరిశ్రమకు కాదని.. ఇండస్ట్రియల్ కారిడార్కని చెబుతున్నారు. తాజాగా అధికారుల మీటింగ్‌లో అదే చెప్పారు.
నిజానికి రేవంత్ రెడ్డి తేలికగా తీసుకున్నారు కానీ.. కొడంగల్‌ను పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లి పరిశ్రమల్ని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి అనుకున్నప్పుడే అసలు రాజకీయం ప్రారంభమయిది. ఆ విషయాన్ని రేవంత్ గుర్తించలేకపోయారు. రేవంత్ అల్లుడు పేరుతో.. రేవంత్ సోదరుల పేరుతో గ్రామాల్లో భూములు లాక్కుంటారని విస్తృతంగా ప్రచారం చేశారు. పరిశ్రమలు పెట్టాలంటే ఖచ్చితంగా భూసేకరణ చేయాల్సిందే. అలాంటి సేకరణ జరిగే అవకాశం ఉన్న గ్రామాలను టార్గెట్ చేసి.. నిరంతరం వ్యతిరేక ప్రచారం చేశారు. ఎవరైనా వస్తే తరిమికొట్టాలని నూరి పోశారు.
చివరికి ఫార్మా పరిశ్రమలు పెడతారని.. భూములు లాక్కుంటారని..కాలుష్యంతో చచ్చిపోతారని అందర్నీ నమ్మించారు. ఇది గుర్తించే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పంటలు పండే భూముల్ని తీసుకోబోమని చెబుతున్నా.. అక్కడ మూడు పంటలు పండే భూముల్ని తీసుకుంటారన్నట్లుగా ప్రచారం చేసేస్తున్నారు. పరిహారం ఇవ్వరని నమ్మిస్తారు. వీటన్నింటినీ రేవంత్ గుర్తించి ఉంటే ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుని ఉండేవారు.