హైదరాబాద్: కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ మొన్న పార్లమెంట్లో 46 నిమిషాలపాటు ఆవేశంగా, ఉద్వేగంగా చేసిన ప్రసంగంపై దేశమంతా రెండుగా విడిపోయి వాదులాడుకుంటున్న సంగతి తెలిసిందే. సంఘ్ పరివార్ మద్దతుదారులంతా మంత్రిని భద్రకాళితో పోలుస్తూ వేనోళ్ళ పొగుడుతుంటే, మిగిలినవారు అదంతా ఓవారాక్షన్ అని, అవాస్తవాలతో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే, స్మృతి ఇరానీ ప్రసంగంలో ఒక కీలకమైన తప్పు దొర్లినట్లు బయటపడింది. రోహిత్ వేముల చనిపోయిన రోజు అతని శరీరాన్ని పరీక్షించటానికిగానీ, బతికించటానికిగానీ ఏ వైద్యుడికీ అవకాశమీయలేదన్నట్లుగా మంత్రి మొన్న పార్లమెంట్లో చెప్పారు. అతని శరీరాన్ని రాజకీయ ప్రయోజనాలకోసం ఒక పావుగా వాడుకున్నారని ఆరోపించారు. అతను జనవరి 17న చనిపోతే, 18 ఉదయం 6.30 గంటల వరకు ఏ పోలీసునూ అక్కడకి వెళ్ళనీయలేదని చెప్పారు. అయితే ఏ వైద్యుడినీ వెళ్ళనీయలేదన్న ప్రకటనను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజశ్రీ ఖండించారు.
నిన్న రాజశ్రీ మీడియాతో మాట్లాడుతూ, తాను వెళ్ళేటప్పటికే రోహిత్ చనిపోయి ఉన్నాడని తెలిపారు. అసలా రోజు ఏమి జరిగిందో ఆమె వివరించారు. జనవరి 17న తాను డ్యూటీనుంచి ఇంటికి తిరిగి వెళ్ళానని, అయితే సాయంత్రం తమ డ్రైవర్ ఫోన్ చేసి, ఎన్ఆర్ఎస్ హాస్టల్లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పినట్లు వెల్లడించారు. నిమిషాలలోనే తాను హాస్టల్‌కు వెళ్ళానని, రోహిత్ శరీరం మంచంమీద ఉందని చెప్పారు.
సాయంత్రం 7.20 గంటల ప్రాంతంలో తాను అతని శరీరాన్ని పరీక్షించానని , పది నిమిషాలలోనే రోహిత్ మరణించినట్లు ప్రకటించానని తెలిపారు. ఇది అందరికీ తెలుసని, యూనివర్సిటీ హెల్త్ బుక్‌లో కూడా ఇది ఉందని, వైస్ ఛాన్సలర్‌కు కూడా దీనిని తాను చెప్పానని డాక్టర్ రాజశ్రీ వెల్లడించారు. తాను స్పాట్‌కు వెళ్ళేటప్పటికే రిగర్ మార్టిస్(వళ్ళు బిగుసుకుపోవటం) మొదలయిందని, పల్స్, బీపీ, హృదయ స్పందని లేవని చెప్పారు. అతని కనుపాపలు పెద్దవైపోయాయని, అప్పుడే తాను చనిపోయినట్లు ప్రకటించానని తెలిపారు. తాను తెల్లవారు ఝామున 3 గంటలవరకు అక్కడే ఉన్నానని చెప్పారు. 2.30 గంటల ప్రాంతంలో రోహిత్ తల్లి షాక్‌కు గురైఉండటంతో ఆమెకు ఆందోళన తగ్గటానికి మాత్రలు ఇచ్చానని డాక్టర్ రాజశ్రీ తెలిపారు.
మరి ఇప్పుడు మంత్రి స్మృతి ఇరానీ, ఆమె మద్దతు దారులు ఏమి సమాధానం చెబుతారో చూడాలి!