‘ఇదిగో పులి’ అంటే… ‘అదిగో పులి’ అన్నట్టుంది పరిస్థితి. ‘రంగస్థలం’ విజయంతో దర్శకుడు సుకుమార్ పేరు గట్టిగా వినబడుతోందిప్పుడు. ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా విజయం కనబడుతోంది. దాంతో సుకుమార్ నెక్స్ట్ సినిమా ఎవరితో? అనే డిస్కషన్ మొదలైంది. ముందు అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది. అతడితో సుకుమార్ ‘ఆర్య’, ‘ఆర్య-2’ సినిమాలు, ‘ఐయామ్ చేంజ్’ షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తరవాత లైనులో మరో సినిమా లేని ఏకైక స్టార్ బన్నీ కావడంతో అతడితో ముడి పెట్టారు. తాజాగా ప్రభాస్ పేరుతో సుకుమార్ పేరు వినబడుతోంది. ఇటీవల ‘బాహుబలి’ స్టార్ ప్రభాస్‌ని సుకుమార్ కలిశాడనే వార్తలూ గుప్పుమన్నాయి. దీనినంతటికీ కారణం ఒక్కటే… ‘ప్రభాస్‌తో చేయాలని వుంది’ అని సుకుమార్ చెప్పడమే. (ఇది చదవండి: https://www.telugu360.com/te/sukumar-about-his-intention-to-make-movie-with-prabhas/)
ప్రస్తుతం ‘రంగస్థలం’ విజయం అందించిన ఆనందంలో సుకుమార్ వున్నారు. తదుపరి సినిమా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో చేయాలనే ఒప్పందం ఒక్కటీ తప్ప… ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయన దగ్గర రెండు మూడు కథలు వున్నాయట. అదీ లైన్ల రూపంలో! కొన్నాళ్లు విరామం తీసుకుని వాటిని హీరోలకు వినిపించి, ఒకే చేయించుకుని స్క్రిప్ట్ వర్క్ చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈలోపు కొత్త ఐడియాలూ రావొచ్చు. ఈ మధ్య ఆయన్ను ఎవరు కలిసినా.. అభినందనలు తప్ప మరొక అంశం ప్రస్తావనకు రావడం లేదట. ఒకవేళ కొత్త సినిమా ప్రస్తావన వచ్చినా… ఈ సందడి తగ్గిన తరవాత డిస్కస్ చేద్దామని అంటున్నారట. ప్రభాస్, సుకుమార్ కాంబినేషన్ సెట్ చేయాలని కొంతమంది నిర్మాతలకు వుంది. ప్రభాస్‌తో చేయాలని సుకుమార్ మనసులోనూ వుంది. తెరపైకి ఎప్పుడు వస్తుందో?