ఉద్యోగ సంఘాల నేతల తీరుపై ఉద్యోగుల్లో రోజు రోజుకు అసహనం పెరిగిపోతోంది. పీఆర్సీ విషయంలో విజయవంతంగా తమ ప్రయోజనాలను దెబ్బ తీశారన్న ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు ఇప్పుడు చర్చల్లో హామీ ఇచ్చినట్లుగా అశుతోష్ కమిటీ నివేదికను ప్రభుత్వం ఇవ్వకపోయినా పట్టించుకోకపోవడం మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. సమ్మెకు వెళ్లే ముందు రోజు జరిగిన చర్చల్లో ప్రభుత్వం నియమించిన అశుతోష్ కమిటీ నివేదికను జీవోలు జారీ చేసిన తర్వాత ఇస్తామని చెప్పారు. కొత్త చర్చల ప్రకారం జీవోలు కూడా ఇచ్చారు. కానీ పీఆర్సీ నివేదికను మాత్రం బయట పెట్టలేదు. ఉద్యోగసంఘ నేతలూ అడగడం లేదు.
ప్రతి ఐదేళ్లకో సారి నియమించి పే రివిజన్ కమిషన్ కు గతంలో అశుతోష్ మిశ్రా నాయకత్వం వహించారు. ఆయన రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. వాస్తవంగా అయితే అదే అధికారికం. దాన్ని బయట పెట్టి ప్రభుత్వం చర్చలు జరిపి ఆ తర్వాత మార్పుచేర్పులతో ఆమోదించాలి. కానీ ఏపీ ప్రభుత్వం అనూహ్యంగా అసలు అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బయట పెట్టకుండా … చీఫ్ సెక్రటరీ కమిటీని ఏర్పాటు చేసి.. కొత్త నివేదిక తెప్పించుకుంది. దాని ప్రకారమే పీఆర్సీ ప్రకటించింది.
అసలు అశుతోష్ కమిటీ నివేదికను ఎందుకు ఇవ్వరని ఉద్యోగులు మొదటి నుంచి ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. అందులో ఏవో కీలకమైన అంశాలు ఉండి ఉంటాయని అందుకే సీక్రెట్‌గా ఉంచుతున్నారన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇది ఉద్యోగుల్లో మరింత ఉత్సుకతకు కారణం అవుతోంది. ఆ కమిటీ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇస్తామని ప్రభుత్వం ఒప్పుకుంది కూడా. కానీ ఇప్పుడు ఆ నివేదిక వల్ల ఉపయోగం ఏమిటి అని వాదించి.. ఇవ్వకుండా పక్కన పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ సంఘ నేతలు కూడా నోరెత్తే పరిస్థితి లేదు.