సెంటు, సెంటున్నర స్థలాల్లో ఇళ్లేమిటంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. అంశాల వారీగా అవ భూములు, మైనింగ్ భూములు, విద్యా సంస్థల భూములు ఇళ్ల స్థలాలకు ఇవ్వవొద్దంటూ కొంత మందికి కోర్టుకు వెళ్లారు కానీ అసలు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని ఎవరు వెళ్లారో ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. కానీ విచారణ జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి కూడా మానవహక్కులు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని తేల్చేసి తీర్పు ఇచ్చేశారు. ఈ ప్రకారం ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించిన తర్వాత మాత్రమే ఇళ్లు కట్టాలి. అప్పటి వరకూ ఇళ్ల నిర్మాణం ఆపేయాలి.
హైకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చిన తర్వాత మొదటగా టీడీపీ నేతలే ఆశ్చర్యపోయారు. సహజంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బతగిలితే వారు ఎగిరి గంతేస్తారు . కానీ ఈతీర్పు వారికీ రుచించలేదు. జగన్ ప్రభుత్వం దగ్గర పైసా లేదని.. కేంద్రం ఇళ్ల కోసం ఇచ్చిన నిధుల్ని కూడా మళ్లించిందని ఇప్పుడు ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని వారు నమ్ముతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు వారికి హైకోర్టు తీర్పు ఇబ్బందికరంగా మారింది. హైకోర్టు తీర్పు చూపించి ప్రభుత్వం ఇల్లు కట్టడం మానేస్తుంది. ఎవరైనా అడిగితే కోర్టు తీర్పును చూపిస్తుంది.
మామూలుగా ఏదైనా అవసరమైన విషయాల్లో ఇలాంటి తీర్పు వస్తే హుటాహుటిన డివిజనల్ బెంచ్‌కు ప్రభుత్వం వెళ్తుంది. కానీ ఇప్పుడు అలాంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్లుగా లేదు. కానీ ఈ తీర్పు ప్రతిపక్షాల కుట్ర అని ప్రచారం చేసేందుకు గ్రౌండ్ రెడీ చేసుకుంటోంది. ప్రతిపక్ష నేతలు తమ పలుకుబడి ఉపయోగించి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని మంత్రి బొత్స అనేశారు. దీంతో ఇళ్ల నిర్మాణం విషయంలో ఏదో జరుగుతోందని టీడీపీ నేతలు మేథోమథనం ప్రారంభించారు.