ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. 14 రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీల మధ్య వాడీవేడీ చర్చలే జరిగాయి. కీలకమైన 19 బిల్లులను అధికార పార్టీ ఆమోదించారు. టీడీపీ హయాంలో చేపట్టిన కార్యక్రమాలపై ఎంక్వయిరీలనీ, జుడిషియల్ కమిషన్ ఏర్పాటు, బీసీ కమిషన్ ఏర్పాటు, నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు… ఇలా ఎన్నికల మేనిఫెస్టో అమలుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ తాజా సమావేశాలను అధికార పార్టీ నిర్వహించింది.
తాజా సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ పట్ల అధికార పార్టీ అనుసరించిన వైఖరి కూడా ఓరకంగా చర్చనీయమైందనే చెప్పాలి. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబును… అదే టాపిక్ తో ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అంటూ దాదాపు వైకాపాకి చెందిన ప్రతీ సభ్యుడూ ఎక్కడో ఒకచోట ఎద్దేవా చేసిన సందర్భాలున్నాయి. ఇక, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష సభ్యుడు అచ్చెన్నాయుడుని ఉద్దేశించి… మనిషి ఎదిగారుగానీ, బుర్ర ఎదగలేదని వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశారు. ఒక సందర్భంలో ‘మేం 150 మందికిపైగా ఉన్నామనీ, ఒక్కసారి మీదపడితే ఎలా ఉంటుంద’నే హెచ్చరికను కూడా ముఖ్యమంత్రే స్వయంగా చేశారు. ఇక, ప్రతిపక్ష నాయకుడుని ఉద్దేశించి చాలా విమర్శలు చేశారు. ఓవరాల్ గా.. వైకాపా నేతలంతా టీడీపీ నేతలపై వ్యక్తిగత విమర్శలే ఎక్కువ చేశారూ అనే అభిప్రాయం తాజా సమావేశాల్లో చాలా సందర్భాల్లో కలిగింది.
అయితే, సభలో 23 మంది సభ్యులను పెట్టుకుని, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఈ సమావేశాల్లో పార్టీని సమర్థంగా నడిపించారా..? అంటే, అవుననే చెప్పాలి. పట్టిసీమపై జరిగిన చర్చ, విత్తనాల కొరతపై చర్చ, సున్నా వడ్డీ రుణాలు, 45 ఏళ్లకే పెన్షన్లు.. ఇలా కొన్ని కీలక అంశాల చర్చకు వచ్చి సందర్భంలో అధికార పార్టీకి ధీటుగానే ప్రతిపక్షం స్వరం వినిపించింది. ఈ సమావేశాల్లోనే ప్రతిపక్షానికి చెందిన ముగ్గురు సభ్యుల్ని సమావేశాలు పూర్తయ్యే వరకూ బహిష్కరించడమూ జరిగింది. ఎన్నికల ఫలితాల తరువాత… అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నిలబడగలరా, సమర్థంగా మాట్లాడగలరా అనే అభిప్రాయాలు ఆ పార్టీ నుంచే గతంలో వ్యక్తమయ్యాయి. కానీ, తాజా సమావేశాలను చూస్తే ధీటుగా సంఖ్యాబలంతో సంబంధం లేకుండా బలమైన వాణిని వినిపించలిగారు అనే అభిప్రాయం కలుగుతోంది.