తుని విధ్వంసం కేసులో అరెస్టయిన వారిలో ముగ్గురిని తప్ప మిగిలిన అందరినీ పోలీసులు బెయిల్ పై విడిచిపెట్టారు. వారిలో పల్ల శ్రీహరిబాబు కూడా ఒకరు. అతను జైలు నుంచి విడుదలైన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “నేను పిఠాపురం మండలంలోని కొలంకి గ్రామానికి చెందినవాడిని. పిఠాపురంలో గల ఒక ఇటుకల బట్టి యజమాని దగ్గర లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాను. తునిలో జరిగిన కాపు ఘర్జన సభకి కొంతమందిని నా లారీలో తీసుకువెళ్ళి మళ్ళీ సభ పూర్తయిన తరువాత తీసుకు రమ్మని నా యజమాని చెప్పారు. సభ జరిగే చోటికి సుమారు అరకిమీ దూరంలోనే నా లారీని నిలిపివేసి అక్కడే వారి కోసం ఎదురుచూస్తూ కూర్చొన్నాను. వారు రావడం ఆలస్యం అయితే నేను తీసుకువచ్చిన వారిలో ఒక వ్యక్తికి నా మొబైల్ నుంచి ఫోన్ చేశాను. అంతకుమించి నాకేమి తెలియదు. ఒకరోజు పిఠాపురం పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ వస్తే వెళ్లాను. వెళ్ళగానే నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు నన్ను అరెస్ట్ చేసిన విషయం మరునాడు న్యూస్ పేపరులో చూసేవరకు నా కుటుంబ సభ్యులకి కూడా తెలియదు,” అని చెప్పాడు.
శ్రీహరి బాబు చెప్పిన దానిని బట్టి అతనికి తుని విధ్వంసంతో ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టమవుతోంది. కానీ ప్రభుత్వానికి, ముద్రగడ పద్మనాభానికి మద్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో అతను చిక్కుకుపోయాడని స్పష్టం అవుతోంది. అయితే ఆ విధ్వంసం తరువాత ముద్రగడతో ప్రభుత్వం చక్కగానే వ్యవహరించినప్పటికీ, ఆ తరువాత అయన మళ్ళీ ప్రభుత్వంపై కత్తి దూయడంతో, పోలీసులు అరెస్టులు మొదలయిన సంగతి అందరికీ తెలుసు. కనుక ప్రభుత్వం ఆయనని కట్టడి చేసేందుకే అరెస్టులు చేసినట్లు భావించవలసి ఉంటుంది.
ఆ సంగతి ముద్రగడకి అర్ధమయింది కనుకనే వారి విడుదల కోసం నిరాహార దీక్షకి దిగారు. ఆయన దీక్షకి ప్రభుత్వం దిగి వచ్చి అరెస్ట్ చేసిన వారినందరినీ విడుదల చేస్తోంది కనుక నేడోరేపో ఆయన దీక్ష విరమించవచ్చు. కానీ వారి మద్యన శ్రీహరిబాబు వంటి సామాన్యులు నలిగిపోతున్నారు. వారిని కాపాడే బాధ్యత ఎవరిపై ఉంది? ప్రభుత్వంపైనా… ముద్రగడపైనా?
కాపుల రిజర్వేషన్ల కోసం పోరాటం మొదలుపెట్టిన ముద్రగడ పద్మనాభం దానిని ప్రశాంతంగా కొనసాగించి ఉండి ఉంటే అసలు ఈ సమస్య తలెత్తేదే కాదు..అరెస్టయిన వారి విడుదల కోసం ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేయవలసిన అవసరం ఉండేదే కాదు. ఆయన కోరినట్లుగానే ప్రభుత్వం కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు మంజూరు చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం చాలా పొరపాటు అని చెప్పక తప్పదు. ఆయన తన లక్ష్యాన్ని మరిచి రాజకీయాలు చేయడంతో చాలా సజావుగా పరిష్కారం అవుతున్న సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. కాపులకి మేలు జరిగినా అటు ఆయనకి ఆ మంచిపేరు దక్కలేదు. ప్రభుత్వానికీ దక్కలేదు. రాష్ట్రంలో కాపులతో సహా అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముద్రగడ పద్మనాభం ఇరువురిపై అసంతృప్తితో ఉన్నారు. వ్రతం చెడ్డా ఫలం దక్కకపోవడం అంటే బహుశః ఇదేనేమో?
కనుక ఇప్పటికైనా ఇరు వర్గాలు సంయమనం పాటిస్తూ, సున్నితమైన ఈ సమస్యని అంతే సున్నితంగా పరిష్కరించుకోవడం మంచిది. ఈ వ్యవహారంలోకి ప్రతిపక్ష పార్టీలని వేలుపెట్టనీయకుండా ముద్రగడ దూరంగా ఉంచగలిగితేనే అది సాధ్యం అవుతుందని గ్రహించాలి.