బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రంగంలోకి దిగిన కేసీఆర్ ప్రయత్నాలు ఫలిస్తాయా..? పార్టీ మారాలనే ఆలోచనతోనున్న ఎమ్మెల్యేలకు.. భవిష్యత్ మనదేనన్న కేసీఆర్ భరోసా బ్రేకులు వేస్తుందా..? అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి.
ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతుండటంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. పార్టీ నుంచి వలసలను నివారించేందుకు ఇక నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. రేవంత్ కు పాలనపై పెద్దగా అనుభవం లేదని స్పష్టం అవుతుందని.. ఖచ్చితంగా భవిష్యత్ బీఆర్ఎస్ దేనని అత్యవసరంగా నిర్వహించిన భేటీకి హాజరైన ఎమ్మెల్యేలకు కేసీఆర్ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అయినా, ఈ భరోసా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గూటికి చేరకుండా నిలువరిస్తుందా..? అంటే కష్టమేనని తెలుస్తోంది.
బీఆర్ఎస్ ను వీడుతారని ప్రచారం జరిగిన భద్రాచలం, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేలు గతంలో కేసీఆర్ ను కలిశారు. తాము బీఆర్ఎస్ లో కొనసాగుతామని స్పష్టం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వారిద్దరూ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ తాజాగా నిర్వహించిన భేటీకి హాజరైన ఎమ్మెల్యేలు సైతం కేసీఆర్ హితబోధతో కన్విన్స్ అయినట్లు కనిపిస్తున్నా..వారిలో మెజార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో కొనసాగడం అనుమానమేనని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ అనుసరించిన విధానాలతో పార్టీలో స్తబ్దత నెలకొందని.. ఈ కారణంగా పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడెందుకు నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతొంది. పార్టీ వలసలను నివారించే విషయంలో కేసీఆర్ ఆలస్యంగా మేల్కొన్నారని… పరిస్థితి ఇప్పటికే కేసీఆర్ చేయి దాటిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.