డ్రగ్స్ కేసు ప్రధానంగా టాలీవుడ్ తారల చుట్టూనే తిరుగుతోంది. ఈ కేసులో తారలందరికీ తెలంగాణ ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. వారెవరికైనా డ్రగ్స్‌తో సంబంధం ఉందన్న విషయాలు బయటపడలేదని కోర్టుకు తెలిపింది. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కేసులు తేలిపోయాయనుకున్నారు. కానీ.. కొత్తగా ఈడీ ఈకేసులో నిజాలు వెలికి తీయాలని ప్రయత్నిస్తూండటంతో టాలీవుడ్‌లోనూ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
తాజాగా తెలంగాణ పోలీసులను డ్రగ్స్ కేసు విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ వెంట పడుతోంది. హైకోర్టు ఆదేశించినప్పటికీ తమకు టెక్నికల్ సాక్ష్యాలు ఇవ్వడం లేదని ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ కూల్ ప్యాడ్ లో సినీతారల చిట్టా ఉందని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. సమగ్ర దర్యాప్తు వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించడంలేదని ఈడీ కోర్టుకి తెలిపింది. గతంలో ఎక్సైజ్ శాఖ సినీతారలు సహా 41మందిని ఎక్సైజ్ శాఖ విచారించింది. డిజిటల్ రికార్డ్స్ , వాంగ్మూలాలు, కాల్ రికార్డ్స్ నమోదు చేసింది. అయితే వాటిని ఈడీకి ఇవ్వలేదు.
తాము సేకరించిన ఆధారాలు ట్రయల్ కోర్టులో ఉన్నాయన్న ఎక్సైజ్ శాఖ గతంలో వాదించింది. కానీ అది నిజం కాదని.. ట్రయల్ కోర్టులో లేవని ఈడీ చెబుతోంది. 12కేసుల్లో 23మంది నిందితులున్నా ఐదుగురు వాంగ్మూలాలు మాత్రమే ట్రైల్ కోర్టులో లభ్యం అయ్యాయని ఈడీ కోర్టు దృష్టికి తెచ్చింది. అంటే సాక్ష్యాలను తెలంగాణ ఎక్సైజ్ అధికారులు మాయం చేశారా లేకపోతే కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లకండా దాటి పెట్టారా అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ట్రయల్ కోర్టులో ఉన్నవే ఉన్నాయని చెప్పడానికి వీల్లేదు.. ఎందుకంటే వాంగ్మూలం తీసుకున్నది..శాంపిల్స్ తీసుకున్నది మీడియాలో విస్తృతంగా ప్రచారం అయింది మరి.