అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలపై పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నమ్మకం పోయిందా..? అంటే, అవుననే అనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర నేతలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ మీదే ఆయన ఆధారపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ఉందనీ, కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకనీ… ఇలా చాలా నివేదికలు పీసీసీ నుంచి ఏఐసీసీకి వెళ్లాయి. అంతేకాదు, అసెంబ్లీ నియోజక వర్గాల అభ్యర్థుల ఎంపికపై కూడా పీసీసీ అభిప్రాయాన్నే ప్రామాణికంగా తీసుకున్నారు రాహుల్. పీసీసీ తయారు చేసి పంపించిన అభ్యర్థుల జాబితానే పక్కాగా నమ్మి.. టిక్కెట్లు కేటాయించేశారు! అయితే, ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి తెలంగాణ అభ్యర్థుల ఎంపికలో రాహుల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట!
లోక్ సభ అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లకూ ఆస్కారం ఉండకూడదని రాహుల్ భావించారని, అందుకే ఆయనే స్వయంగా తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. ముగ్గురు సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీని రాహుల్ తెలంగాణ పంపించారని సమాచారం. ఆ కమిటీ 17 లోక్ సభ నియోజక వర్గాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో వాస్తవాలపై అధ్యయనం చేసి, పార్టీ తరఫున ఎవరు అభ్యర్థిగా ఉంటే మంచిదనే అభిప్రాయాన్ని ప్రజల నుంచే తెలుసుకుంటుందని తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా రాహుల్ టీమ్ ఇప్పటికే 17 మందితో ఒక జాబితాను తయారు చేసినట్టు సమాచారం.
ఈ జాబితా గురించి రాష్ట్ర ఎన్నికల కమిటీకి తెలీదని అంటున్నారు! రాష్ట్ర కమిటీ పంపిన నివేదికను పక్కనపెట్టుకుని… రాహుల్ టీమ్ తయారు చేసిన నివేదికలో పేర్లను పోల్చి చూసుకున్నాకనే అభ్యర్థుల ఎంపిక జరిగిందని పార్టీ వర్గాల నుంచి ఇప్పుడు వినిపిస్తోంది. మొత్తానికి, తెలంగాణ రాష్ట్ర నేతలు ఇచ్చే నివేదికల మీద రాహుల్ ఈసారి ఆధారపడటం లేదు! మరి, ఈ అంశాన్ని టి. కాంగ్రెస్ నాయకులు ఎలా చూస్తారో చూడాలి! రాహుల్ సొంత నిర్ణయంగా దీన్ని తీసుకుంటారా, లేదా పనితీరు మార్చుకోవాల్సిన అవసరాన్ని రాహుల్ పరోక్షంగా బలంగా చెప్పారని నేతలు భావిస్తారా అనేది చూడాలి.