ఉద్వేగ్ కంపెనీకి రూ.14 కోట్లు చెల్లించాలని టీటీడీ నిర్ణయించిందా..?. రూ. నాలుగు వందల కోట్ల విలువైన పదెకరాల స్థలాన్ని అప్పగించాలని నిర్ణయించారా..? అంటే.. అవునని.. ఎంవోయూ పత్రాల్లో ఉన్నట్లుగా టీడీపీ చెబుతోంది. ఈ మేరకు ఎంవోయూనూ టీడీపీ నేతలు విడుదల చేశారు. ఇప్పుడు ఇది.. సంచలనాత్మకం అవుతోంది. కొద్దిరోజుల కిందట.. ఉద్వేగ్ ఇన్ఫ్రా పేరుతో ఓ కంపెనీ యజమాని తిరుమలకు వచ్చి రూ. మూడు వందల కోట్లతో చిన్న పిల్లల ఆస్పత్రి కట్టేస్తానని.. అది మొత్తం విరాళమేనని ప్రకటించారు. మామూలుగా విరాళం అయితే…చెక్ తీసుకోవాలి.. లేకపోతే ఆన్ లైన్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి..కానీ ఇక్కడ ఉద్వేగ్ యజమానితో టీటీడీ యాజమాన్యం ఎంవోయూ చేసుకుంది. విరాళానికి ఎంవోయూ ఏమిటి అని చాలా మంది ఆశ్చర్యపోయారు.
తర్వాత ఆ ఉద్వేగ్ కంపెనీ సూట్ కేసు కంపెనీ అని తేలింది. వ్యాపారాలు.. కార్యాకలాపాలు ఏమీ లేవని.. ఆ కంపెనీ ఖాతాలో రూ. మూడు వందలు కూడా లేవని వెల్లడయింది. అప్పుడే .. ఆ సూట్ కేస్ కంపెనీలో కొంతమంది తెలుగువాళ్లు డైరక్టర్లుగా వారం కిందటే చేరారని కూడా స్పష్టమయింది. దాంతో అప్పుడే.. అసలు ఆ ఉద్వేగ్ ఏంటి… ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందం ఏమిటో బయట పెట్టాలన్న డిమాండ్లు వినిపించాయి. కానీ.. ఎంవోయూను టీటీడీ అధికారులు సీక్రెట్‌గా ఉంచారు. ఇచ్చేదిలేదన్నారు.కానీ ఎలా సంపాదించారో కానీ.. ఎంవోయూ పత్రాలను టీడీపీ బయట పెట్టింది. అందులో రూ. పధ్నాలుగు కోట్లను ముందస్తుగా ఉద్వేగ్కు చెల్లించాలని ఉంది.
పాలకమండలి సమావేశంలో కూడా తీర్మానించారని టీడీపీ నేతలు వెల్లడించారు. రూ. నాలుగు వందల కోట్ల విలువైన స్థలం కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఆ పథ్నాలుగు కోట్లు చెల్లించారో లేదో స్పష్టత లేదు. కానీ విరాళం ఇస్తామని చెప్పి వచ్చిన వారికి టీటీడీ సొమ్మును చెల్లించడానికి నిర్ణయించారన్నది ఇక్కడ కీలకం. ఈ అంశంలో తవ్వేకొద్దీ ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయి. త్వరలో మరిన్ని సంచలనాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది.